ఆంధ్రను దెబ్బకొట్టిన సచిన్ కొడుకు.. పోరాడి ఓడిన ఏపీ

ఆంధ్రను దెబ్బకొట్టిన సచిన్ కొడుకు.. పోరాడి ఓడిన ఏపీ

స్వదేశంలో క్రికెట్ మ్యాచ్‌లు జోరందుకున్నాయి. ఓవైపు క్రికెట్ మహా సంగ్రామం వన్డే ప్రపంచ కప్ 2023 జరుగుతుండగా, మరోవైపు దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో గోవా జట్టు తొలి విజయాన్ని అందుకుంది. గ్రూపు-సిలో భాగంగా రాంఛీ వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గోవా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

మిసల్‌ మెరుపు ఇన్నింగ్స్‌

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన గోవా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. గోవా కెప్టెన్‌ దర్శన్ మిసల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆంధ్ర బౌలర్లపై ఎదురుదాడికి దిగిన మిసల్.. కేవలం 27 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 61 పరుగులు చేశాడు. అతడితో పాటు రాహుల్‌ త్రిపాఠి(47), తునీష్ సాకర్(11 బంతుల్లో 34) రాణించడంతో గోవా భారీ స్కోర్ చేసింది. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి, పృథ్వీ రాజ్‌ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. హనుమ విహారి, లలిత్ మోహన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

విహారి vs  అర్జున్ టెండూల్కర్

232 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు ఆంధ్ర 18.3 ఓవర్లలో 201 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఒకానొక సమయంలో మ్యాచ్ ఆంధ్ర వైపు తిరిగినా.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం ఆ జట్టును దెబ్బకొట్టింది. ఈ  మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆంధ్ర బ్యాటర్లలో హనుమ విహారి(58; 33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) పరుగులతో రాణించగా.. శ్రీకర్‌ భరత్‌(31), అశ్విన్‌ హెబ్బర్‌(31) పర్వాలేదనిపించారు.