లఖీంపూర్‌కు రాహుల్.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

లఖీంపూర్‌కు రాహుల్.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

న్యూఢిల్లీ: లఖీంపూర్‌ ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉండటంతో నలుగురుకు మించి వ్యక్తులు పోలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేవలం ఇద్దరు లీడర్లతో కలసి తాను లఖీంపూర్‌కు వెళ్తున్నానని రాహుల్ అన్నారు. రైతులపై జరిగిన దాడి మీద సీరియస్ అయిన రాహుల్.. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మంత్రి కొడుకునని చెప్పుకుంటూ ఓ నేరస్థుడు రైతులపై దాడికి తెగబడ్డాడంటూ దుయ్యబట్టారు. 

‘ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం లక్నోను విజిట్ చేశారు. కానీ ఆయన లఖీంపూర్‌కు వెళ్లలేదు. ఇది రైతులపై ఓ ప్లాన్ ప్రకారం చేసిన దాడి అనే చెప్పాలి. ఇప్పుడు దేశంలో నియంతృత్వం రాజ్యమేలుతోంది. రాజకీయ నాయకులను యూపీలోకి రానివ్వడం లేదు. లఖీంపూర్ బాధితుల కుటుంబాలను కలుద్దామని వచ్చిన ఛత్తీస్‌గఢ్ సీఎంను ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకంటే ఇక్కడ భయంకరమైన చోరీ జరుగుతోంది’ అని రాహుల్ విమర్శించారు. కాగా, లఖీంపూర్ బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీని మూడ్రోజుల కింద పోలీసులు అదుపులోకి తీసుకుని.. సీతాపూర్‌లోని గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించారు. దీంతో ఆమె అక్కడి నుంచే నిరసన తెలుపుతున్నారు. అయితే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి  సోషల్ మీడియాలో ప్రియాంక పోస్టులు పెట్టడం.. పలువురు లీడర్లు లఖీంపూర్‌కు రావడాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు సీతాపూర్‌లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. తమను విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్నారు. 

మరిన్ని వార్తలు: 

లవ్​మ్యారేజ్​ చేసుకుందని బిడ్డను తీస్కపోయిన్రు

‘రామాయణ్’ రావణుడు ఇకలేడు..

ఖాళీలుంటే నోటిఫికేషన్లు ఎందుకియ్యరు?

మాస్ కాంబో ‘అఖండ’ రెడీ