నమీబియాపై భారత్ ఆల్‌‌రౌండ్‌‌ షో

నమీబియాపై భారత్ ఆల్‌‌రౌండ్‌‌ షో

దుబాయ్‌‌‌‌: సెమీస్​ రేస్‌‌కు దూరమైన ఇండియా టీమ్‌‌.. టీ20 వరల్డ్‌‌కప్‌‌ను విజయంతో ముగించింది. ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొడుతూ.. సోమవారం జరిగిన సూపర్‌‌–12, గ్రూప్‌‌–2 లాస్ట్‌‌ లీగ్‌‌ మ్యాచ్‌‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో నమీబియాపై నెగ్గి ఓదార్పు దక్కించుకుంది.  ఆడిన ఐదు మ్యాచ్‌‌ల్లో మూడు విజయాలతోనే (6 పాయింట్లు) సరిపెట్టుకుని టోర్నీ నుంచి నాకౌట్‌‌ అయ్యింది. టాస్‌‌ గెలిచి ఇండియా ఫీల్డింగ్‌‌ ఎంచుకోగా, నమీబియా 20 ఓవర్లలో 132/8 స్కోరు చేసింది. డేవిడ్‌‌ వీస్‌‌ (26) టాప్‌‌ స్కోరర్‌‌. తర్వాత ఇండియా 15.2 ఓవర్లలో వికెట్‌‌ నష్టానికి 136 రన్స్‌‌ చేసి నెగ్గింది. రోహిత్‌‌ శర్మ (37 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56), కేఎల్‌‌ రాహుల్‌‌ (36 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 నాటౌట్‌‌) హాఫ్‌‌ సెంచరీలతో దంచికొట్టారు. పెద్ద టార్గెట్‌‌ కాకపోవడం, నమీబియా బౌలింగ్‌‌లో పదును లేకపోవడంతో స్టార్టింగ్‌‌ నుంచే ఇండియా ఓపెనర్లు చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించడంతో స్కోరు బోర్డు వాయువేగంతో కదిలింది. పవర్‌‌ప్లేలో 54 రన్స్‌‌ చేసిన ఈ జోడీ ఫస్ట్‌‌ వికెట్‌‌కు 9.5 ఓవర్లలో 86 రన్స్‌‌ జోడించింది. ఈ దశలో రోహిత్‌‌ ఔటైనా, సూర్యకుమార్‌‌ (19 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 25 నాటౌట్‌‌) వేగంగా ఆడాడు. రాహుల్‌‌తో మంచి సమన్వయం చూపుతూ నమీబియా బౌలింగ్‌‌పై ఎదురుదాడి చేశాడు. ఫలితంగా సెకండ్‌‌ వికెట్‌‌కు 33 బాల్స్‌‌లోనే 50 రన్స్‌‌ రావడంతో ఇండియా విజయం ఖాయమైంది. జడేజాకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.  కాగా, ఈ నెల10, 11న సెమీఫైనల్స్​, 14న ఫైనల్​ మ్యాచ్​ జరుగుతుంది.
బౌలింగ్‌‌.. అదుర్స్‌‌
ముందుగా బ్యాటింగ్‌‌కు వచ్చిన నమీబియాను సీనియర్లు స్పిన్నర్లు  జడేజా (3/16), అశ్విన్‌‌ (3/20) బాగా కట్టడి చేశారు. వీళ్లకు బుమ్రా (2/19) అండగా నిలిచాడు. ఓపెనర్‌‌ స్టీఫెన్‌‌ బార్డ్‌‌ (21) వాన్‌‌ లింగెన్‌‌ (14) ఫస్ట్‌‌ వికెట్‌‌కు 33 రన్స్‌‌ జోడించారు. 5వ ఓవర్‌‌లో లింగెన్‌‌ ఔటైన తర్వాత నమీబియా ఇన్నింగ్స్‌‌ పేకమేడలా కూలింది. రెండు వైపుల నుంచి స్పిన్నర్లు  ప్రెజర్​ పెంచడంతో  క్రెయిగ్‌‌ విలియమ్స్‌‌ (0), ఎరాస్మస్‌‌ (12), ఎటన్‌‌ (5) వరుస విరామాల్లో ఔటయ్యారు. ఈ దశలో వీస్‌‌ పోరాటం మొదలుపెట్టాడు. కానీ అవతలి వైపు నుంచి అతనికి సరైన సహకారం అందలేదు. 15వ ఓవర్‌‌లో స్మిట్‌‌ (9) ఇచ్చిన క్యాచ్‌‌ను రోహిత్‌‌ సూపర్‌‌గా అందుకున్నాడు. చివర్లో ఫ్రీలింక్‌‌ (15 నాటౌట్‌‌), రూబెన్‌‌ (13 నాటౌట్‌‌) పోరాటంతో నమీబియా ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. 
సంక్షిప్త స్కోర్లు
నమీబియా: 20 ఓవర్లలో 132/8 (వీస్‌‌ 26, బార్డ్‌‌ 21, అశ్విన్‌‌ 3/20, జడేజా 3/16), 
ఇండియా: 15.2 ఓవర్లలో 136/1 (రోహిత్‌‌ 56, రాహుల్‌‌ 54 నాటౌట్​, ఫ్రీలింక్‌‌ 1/19).