
- నమ్మకంగా ఉన్న బీసీసీఐ
- ఐపీఎల్ ఫేజ్–2కు యూకేనే ఫస్ట్ చాయిస్
- 29న జరిగే ఎస్‌జీఎంలో చర్చించనున్న పెద్దలు
ముంబై: దేశంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది అక్టోబర్–- నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌ను ఇండియాలోనే నిర్వహించేందుకు బీసీసీఐ కట్టుబడి ఉంది. ఈ మేరకు ఈ నెల 29న జరిగే స్పెషల్ జనరల్ బాడీ (ఎస్‌జీఎం)లో ఈ విషయంపై చర్చించనుంది. జూన్1న ఐసీసీ మీటింగ్ ఉన్న నేపథ్యంలో వరల్డ్‌కప్ ఆతిథ్యంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అవసరం అయితే చివరి నిమిషంలో టోర్నీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు షిఫ్ట్ చెయ్యడాన్ని సెకండ్ ఆప్షన్‌గా కొనసాగించనుంది. అయితే, దేశంలో కరోనా పరిస్థితిని బట్టి జులై తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకోనుంది. ‘ఇప్పటికైతే ఇండియానే వరల్డ్‌కప్‌నకు హోస్ట్. బీసీసీఐ ఆలోచన ఇదే. అయితే పరిస్థితులు మళ్లీ చేయి దాటితే మాత్రం జూన్ తర్వాతే దీనిపై పునరాలోచన చేస్తుంది. యూఏఈ మాత్రం సెకండ్ ఆప్షన్‌గా ఉంటుంది’ అని బోర్డు వర్గాలు చెప్పాయి. అవసరమైతే రెండు నగరాల్లోనే (ముంబై, పుణె) మొత్తం టోర్నీని పూర్తి చేయాలని, ఫైనల్‌ను మాత్రం అహ్మదాబాద్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని తెలుస్తోంది.
యూకేలో ఐపీఎల్..!
ఇక, ఐపీఎల్ ఫేజ్–2 రీషెడ్యూలింగ్‌పై కూడా ఎస్‌జీఎంలో చర్చించనున్నారు. ఐపీఎల్ –14లో మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణకు యూకే ఫస్ట్ చాయిస్ వెన్యూగా ఉంది. ఎందుకంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ ఇండియా అక్కడే ఉండనుంది. అలాగే, ఇతర దేశాల ప్లేయర్లను యూకే తీసుకురావడం కూడా సులభం కానుంది. బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ కూడా సానుకూలంగా ఉంది. అయితే, ఖర్చు ఎక్కువ కావడం ఒక్కటే యూకే విషయంలో ప్రతికూలతగా ఉంది. ‘యూకే ఎప్పుడూ ఖరీదైన ప్రాంతమే. కానీ, అక్కడి గవర్నమెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం ఫ్యాన్స్‌ను అనుమతిస్తోంది. ఫ్రాంచైజీలకు గేట్ రెవెన్యూ (టిక్కెట్ల డబ్బు) వస్తుంది కాబట్టి ఖర్చులను మేనేజ్ చేసుకోవచ్చు’ అని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ జూన్ తర్వాత వరల్డ్‌కప్‌ను ఇండియా బయటకు తీసుకెళ్లాలని బీసీసీఐ నిర్ణయించినా కూడా ఐపీఎల్‌కు ఇంగ్లండ్ ఫస్ట్ చాయిస్ ఆప్షన్‌గా ఉంటుందని చెప్పాయి. ఖర్చులు తగ్గించుకోవాలంటే మాత్రం యూఏఈ సెకండ్ ఆప్షన్‌గా ఉంటుందని, అలాగే, శ్రీలంకలో ఐపీఎల్ నిర్వహించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని బోర్డు వర్గాలు అంటున్నాయి.
ఐపీఎల్ కోసం ఇంగ్లండ్ సిరీస్‌లో మార్పులు!
ఐపీఎల్ ఫేజ్–2 కోసం టీమిండియా-, ఇంగ్లండ్ మధ్య జరగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అవసరమైతే ఈ సిరీస్‌లో మ్యాచ్‌ల సంఖ్యను కుదించే చాన్సుంది. తద్వారా టీ20 వరల్డ్‌కప్‌నకు ముందే ఐపీఎల్‌ను పూర్తి చేయొచ్చు. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో బీసీసీఐ చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. ‘ఐపీఎల్‌ను సర్దుబాటు చేసేందుకు ఐదు టెస్టుల సిరీస్‌లో మార్పులు చేసేందుకు ఈసీబీ, బీసీసీఐ మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఆ వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. టెస్టు సిరీస్‌లో మార్పులు చేయడానికి ఈసీబీ అంగీకరిస్తే మాత్రం ఐపీఎల్ తమ దేశంలోనే జరగాలని కోరుకుంటుంది. ఎందుకంటే లీగ్ వల్ల ఆ దేశానికి ఆదాయం వస్తుంది. దీనివల్ల ఇరువురికీ ప్రయోజనం ఉంటుంది. ఏదేమైనా ఐపీఎల్‌ను పూర్తి చేయడం ఇండియన్ బోర్డు తొలి ప్రాధాన్యత కానుంది. దీనిపై వాటాదారులందరినీ ఏకాభిప్రాయానికి తీసుకొచ్చిందని, కాబట్టి 14వ సీజన్‌ను పూర్తి చేసే విషయంలో అనుమానమే అవసరం లేదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కాగా, డొమెస్టిక్ క్రికెట్‌పై ఎస్‌జీఎంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు.