ఇంట్రెస్టింగ్ గా టీ20 వరల్డ్ కప్ సెమీస్ పోరు

ఇంట్రెస్టింగ్ గా టీ20 వరల్డ్ కప్ సెమీస్ పోరు

టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ పోరు ఇంట్రెస్టింగ్ గా మారింది. రేపు న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుండా....ఎల్లుండి భారత్,ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. అయితే ఈ మ్యాచుల్లో విజయం సాధించాలని ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాయి. అటు కివీస్ పై పాక్ గెలవడంతో పాటు..ఇంగ్లాండ్ పై ఇండియా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తద్వారా చిరకాల ప్రత్యర్థులు ఫైనల్లో తలపడాలని ఆశిస్తున్నారు.

 

సెమీస్ ఫైట్ కు అంతా రెడీ

టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ ఫైట్ కు అంతా రెడీ అయ్యింది. గ్రూప్ 1 టాపర్ న్యూజీల్యాండ్ తో గ్రూప్ 2 సెకండ్ ప్లేస్ లో నిలిచిన పాకిస్థాన్ మధ్య రేపు ఫస్ట్ సెమీస్ జరగనుంది. సిడ్నిలో వేదికగా  జరిగే ఫస్ట్ ఫైట్ కు రెండు జట్లు సిద్ధమయ్యాయి. టోర్నీలో వరుస విజయాలతో సత్తా చాటిన న్యూజిలాండ్ .. సెమీ ఫైనల్ లో పాక్ పై అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. అయితే ఆ జట్టు ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ లో విజేతగా నిలవలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈసారి వరల్డ్ కప్ కొట్టాలనుకుంటోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతంగా కనిపిస్తోంది. ఆ జట్టులో మ్యాచ్ ను ఒంటిచెత్తో గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్స్ ఉన్నారు.

ఫైనల్ చేరాలని పట్టుదలగా..

అదృష్టంతో టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరిన పాక్...పటిష్ట న్యూజిలాండ్ ను ఓడించాలని పట్టుదలతో ఉంది. పాకిస్తాన్ లో కెప్టెన్ బాబర్, రిజ్వాన్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్ రాణిస్తే ఆ టీమ్ కు తిరుగుండదు.  అయితే పాక్ విజయం బౌలర్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంది. మరోవైపు 1992 వరల్డ్ కప్ నాటి పరిస్థితిని పాక్ అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. 1992 వరల్డ్ కప్ లో సెమీస్ లో న్యూజిలాండ్ ను ఓడించిన పాక్.. ఫైనల్లో ఇంగ్లండ్ తో నెగ్గి టైటిల్ ను సొంతం చేసుకుంది. ఈసారి అలాగే జరగుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

భారత్, ఇంగ్లాండ్ మధ్య టఫ్ ఫైట్

ఇక రెండో సెమీస్ లో భారత్, ఇంగ్లాండ్ మధ్య టఫ్ ఫైట్ జరగనుంది.ఆడిలైడ్ లో జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు టీమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. సౌతాఫ్రికాపై మినహా సూపర్ 12లో అన్ని జట్లపై విజయం సాధించిన టీమిండియా  ఫుల్ జోష్ లో ఉంది. అదే ఫామ్ ను సెమీస్ లోనూ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. కేఏల్ రాహుల్,  సూర్యకుమార్ యాదవ్, కోహ్లీ లాంటి కీలక ప్లేయర్స్ తో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, హర్థిక్ పాండ్యా కూడా రాణిస్తే టీమిండియాను ఆపడం ఇంగ్లండ్ కు సాధ్యం కాదు. మరోవైపు ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ శర్మ చేతికి గాయమైంది. దీంతో అతను  క్రీజు నుంచి బయటికి వెళ్లిపోయాడు. రోహిత్ గాయంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అటు బౌలింగ్ లో హర్షదీప్ సింగ్, షమీ, భువీ బాగా రాణిస్తే భారత్ కు తిరుగుండదు. 

టీమిండియాకు అడ్వాంటేజ్..

హార్డ్ హిట్టర్స్ ఉన్న ఇంగ్లండ్ ను ఓడించటం టీమిండియాకు అంత సులువుకాదు. టోర్నీ ఫస్ట్ నుంచి ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న ఇంగ్లాండ్ భారత్ పై విజయం సాధించి ఫైనల్లో  అడుగుపెట్టాలని చూస్తోంది. అలెక్స్ హేల్స్, బట్లర్, లివింగ్ స్టోన్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, సామ్ కరన్ లాంటి కీ ప్లేయర్స్ తో ఇంగ్లండ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ లో ఇంగ్లీష్ టీమ్ సత్తా చాటుతోంది. అయితే కీలక ఆటగాడు డేవిడ్ మలన్ గాయంతో సెమీస్ కు దూరమవడం టీమిండియాకు అడ్వాంటేజ్. అయితే ఫస్ట్ సెమీస్ లో న్యూజిలాండ్ పై పాకిస్తాన్ విజయం సాధించి..ఫైనల్ లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.