సెమీస్లో ఓడినా..కివీస్ కంటే టీమిండియాకే ఎక్కువ ప్రైజ్మనీ

సెమీస్లో ఓడినా..కివీస్ కంటే టీమిండియాకే ఎక్కువ ప్రైజ్మనీ

దాదాపు నెల రోజుల పాటు ఆసక్తిగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022 ఆదివారం ముగిసింది. అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇంగ్లాండ్, పాకిస్తాన్ ఫైనల్ చేరాయి. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పాకిస్తాన్పై ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో సారి పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా అవతరించింది. మరి విజేతగా నిలిచిన ఇంగ్లాండ్కు ఎంత ప్రైజ్మనీ దక్కింది. రన్నరప్ పాక్ ఎంత సంపాదించింది. సెమీస్లో ఓడిన టీమిండియాతో పాటు ఇతర జట్లు ఎంత మొత్తాన్ని గెలుచుకున్నాయో  చూద్దాం..

విజేతకు ఎంత ప్రైజ్మనీ...?
టీ20 వరల్డ్ కప్ 2022 గెలిచిన ఇంగ్లాండ్కు రూ.13.84 కోట్ల మొత్తం ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన పాక్కు రూ. 7.40  కోట్లు ప్రైజ్‌మనీ గెలుచుకుంది. ఇక సెమీస్లో  ఇంటిదారి పట్టిన టీమిండియాకు 4.50 కోట్లు,  న్యూజిలాండ్‌కు రూ.4.19 కోట్లు దక్కాయి. అయితే సూపర్-12లో న్యూజిలాండ్ కంటే టీమిండియా విజయాలు సాధించడంతో..కివీస్ కంటే భారత్కు ఎక్కువగా అందింది.

సూపర్ 12లో ఓడిన జట్లకు..?
సూపర్-12లో ఓడిన  ఆస్ట్రేలియా రూ.1.53 కోట్లు, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లకు చెరో రూ.1.2 కోట్లు,  శ్రీలంక రూ. 1.85 కోట్లు, జింబాబ్వే రూ. 88.50 లక్షలు, ఐర్లాండ్ రూ. 1.53 కోట్లు, నెదర్లాండ్స్ రూ.1.85 కోట్లు, అఫ్ఘనిస్తాన్ రూ. 56.35 లక్షలు చొప్పున ప్రైజ్మనీ దక్కించుకున్నాయి.  అటు గ్రూప్ దశలో నిష్క్రమించిన 4 జట్లు రూ. 64.40 లక్షల చొప్పున  అందాయి.