రాయల్స్‌‌ పాంచ్ పటాకా

రాయల్స్‌‌ పాంచ్ పటాకా
  •     3 వికెట్ల తేడాతో పంజాబ్‌‌పై థ్రిల్లింగ్ విక్టరీ
  •     రాణించిన హెట్‌‌మయర్, కేశవ్, చహల్

మల్లాన్‌‌పూర్‌‌‌‌ (చండీగఢ్) : ఐపీఎల్‌‌17లో  టేబుల్ టాపర్‌‌‌‌ రాజస్తాన్ రాయల్స్ ఐదో విక్టరీ అందుకుంది. గత మ్యాచ్‌‌లో ఓటమి నుంచి  వెంటనే పుంజుకుంది. షిమ్రన్ హెట్‌‌మయర్ (10 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌‌‌, 3 సిక్సర్లతో 27 నాటౌట్‌‌) మెరుపు బ్యాటింగ్‌‌తో శనివారం ఉత్కంఠగా జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌‌లో  రాయల్స్ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌‌పై గెలిచింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 147/8 స్కోరు చేసింది.

అశుతోష్‌‌ శర్మ (16 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌‌‌, 3 సిక్సర్లతో 31), జితేశ్ శర్మ (24 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌‌‌, 2 సిక్సర్లతో 29) రాణించారు. కేశవ్‌‌ మహారాజ్, అవేశ్‌‌ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌‌లో రాయల్స్ 19.5 ఓవర్లలో 152/7 స్కోరు చేసి గెలిచింది. యశస్వి జైస్వాల్​ (39) కూడా రాణించాడు. రబాడ, కరన్ రెండేసి వికెట్లు తీశారు. హెట్‌‌మయర్​కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

పంజాబ్ తడబాటు.. 

టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్‌‌ తడబడింది.  చప్పగా సాగిన ఇన్నింగ్స్‌‌కు  సరైన ఆరంభం లభించలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీసిన రాజస్తాన్ బౌలర్లు కింగ్స్‌‌ను కట్టడి చేశారు. చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్​ మెరుపులతో కింగ్స్ ఆ మాత్రం స్కోరు చేసింది.  పేసర్లు ట్రెంట్‌‌ బౌల్ట్‌‌, అవేశ్ కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో ఓపెనర్లు అథర్వ తైడే (15), జానీ బెయిర్‌‌‌‌స్టో (15) నింపాదిగా ఆడారు. తొలి వికెట్‌‌కు 27 రన్స్‌‌ జోడించిన తర్వాత అవేశ్‌‌ బౌలింగ్‌‌లో కుల్దీప్‌‌ సేన్‌‌కు క్యాచ్ ఇచ్చి అథర్వ వెనుదిరిగాడు.

వన్‌‌డౌన్‌‌లో వచ్చిన ప్రభ్‌‌సిమ్రన్ సింగ్ (10) కూడా షాట్లు ఆడలేకపోవడంతో పవర్‌‌‌‌ప్లేలో  పంజాబ్‌‌ 38/1 స్కోరు మాత్రమే చేసింది. ఏడో ఓవర్లో స్పిన్నర్ చహల్.. ప్రభ్‌‌సిమ్రన్‌‌ను వెనక్కుపంపాడు. మరో స్పిన్నర్ కేశవ్‌‌ మహారాజ్ తన వరుస ఓవర్లలో బెయిర్‌‌‌‌స్టో, స్టాండిన్‌‌ కెప్టెన్‌‌ సామ్‌‌ కరన్‌‌ (6)ను ఔట్‌‌ చేసి దెబ్బకొట్టాడు. వరుసగా ఐదు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో 11 ఓవర్లకు పంజాబ్ 58/4తో డీలా పడింది. ఈ దశలో మహారాజ్ బౌలింగ్‌‌లో జితేశ్‌‌, శశాంక్ (9) చెరో బౌండ్రీతో స్పీడు పెంచే ప్రయత్నం చేశారు.

కానీ, 13వ ఓవర్లో శశాంక్‌‌ (9)ను పెవిలియన్‌‌ చేర్చిన కుల్దీప్ సేన్‌‌ రెండు రన్సే ఇచ్చాడు.  సేన్ తర్వాతి ఓవర్లో జితేశ్‌‌ సిక్స్, లివింగ్ స్టోన్ (21)4,6 బాదడంతో స్కోరు వంద దాటింది.  అవేశ్ బౌలింగ్‌‌లో జితేశ్‌‌ పెవిలియన్ చేరగా, చహల్ వేసిన 18వ ఓవర్లో లివింగ్‌‌స్టోన్  రనౌట్‌‌గా వెనుదిరిగాడు. 19వ ఓవర్ రెండో బాల్‌‌కు అషుతోష్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను అవేశ్‌‌ డ్రాప్‌‌ చేశాడు. ఈ చాన్స్‌‌ను సద్వినియోగం చేసుకున్న అశుతోష్​ అదే ఓవర్లో రెండు సిక్సర్లతో పాటు  బౌల్ట్‌‌ వేసిన ఆఖరి ఓవర్లో  ఫోర్‌‌‌‌ కొట్టి లాస్ట్ బాల్‌‌కు 
ఔటయ్యాడు. 

గెలిపించిన హెట్‌‌మయర్

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ ఇబ్బంది పడినా హెట్‌మయర్ మెరుపులతో గట్టెక్కింది. స్లో వికెట్‌‌పై పంజాబ్ కూడా అద్భుతంగా బౌలింగ్‌‌ చేసింది. దాంతో కొత్త ఓపెనింగ్ జోడీగా వచ్చిన యశస్వి జైస్వాల్, తనుష్ కోటియన్ (24) వేగంగా ఆడలేకపోయారు. ఈ సీజన్‌‌లో తడబడుతున్న యశస్వి కొన్ని రన్స్ చేసి ఫామ్‌‌లోకి వచ్చినప్పటికీ తన మార్కు షాట్లు కొట్టలేకపోయాడు. మరో  ఎండ్‌‌లో కోటియన్ బాల్‌‌కో రన్‌‌ కూడా రాబట్టకపోవడంతో పవర్ ప్లేలో 49 రన్సే వచ్చాయి. తొమ్మిదో ఓవర్లో ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌తో కోటియన్‌‌ను లివింగ్‌‌స్టోన్ పెవిలియన్ చేర్చాడు.

వన్‌‌డౌన్‌‌లో బ్యాటింగ్‌‌కు వచ్చిన కెప్టెన్‌‌ సంజూ శాంసన్‌‌ (18).. లివింగ్‌‌స్టోగ్‌‌  తర్వాతి ఓవర్లోనే 6,4 కొట్టి ఇన్నింగ్స్‌‌లో చలనం తీసుకొచ్చాడు. కానీ, తర్వాతి ఓవర్లో రబాడ వేసిన షార్ట్ వైడ్ బాల్‌‌ను వెంటాడిన జైస్వాల్‌‌ హర్షల్‌‌ పటేల్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. తన తర్వాతి ఓవర్లోనే శాంసన్‌‌ను రబాడ ఎల్బీ చేశాడు. దాంతో రాయల్స్‌‌పై ఒత్తిడి పెరిగింది. ఇన్‌‌ఫామ్ బ్యాటర్ రియాన్ పరాగ్ (23), ధ్రువ్ జురెల్ (6) వేగంగా ఆడలేకపోయారు.  కరన్‌‌ వేసిన 16వ ఓవర్లో పరాగ్ ఇచ్చిన క్యాచ్‌‌ను లివింగ్‌‌స్టోన్ వదిలేశాడు. అర్ష్‌‌దీప్ వేసిన తర్వాతి ఓవర్లో పరాగ్ ఓ సిక్స్‌‌ కొట్టినా మరో షాట్‌‌కు ట్రై చేసి రబాడకు క్యాచ్ ఇచ్చాడు.

చివరి 18 బాల్స్‌‌లో 34 రన్స్ అవసరం అయ్యాయి.  18వ ఓవర్లో జురెల్ ఔటైనా.. హెట్‌‌మయర్‌‌‌‌ 6,4 కొట్టి రాయల్స్‌‌ను రేసులో నిలిపాడు. కరన్ వేసిన తర్వాతి ఓవర్లో పావెల్ (8) వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ,  మూడో బాల్‌‌కు అతను ఔట్​ అవగా.. లాస్ట్‌‌ బాల్‌‌కు మహారాజ్‌‌ (1) లివింగ్‌‌స్టోన్‌‌కు క్యాచ్ ఇచ్చాడు.  దాంతో చివరి ఓవర్లో రాయల్స్‌‌కు పది రన్స్ అవసరం అయ్యాయి. అర్ష్‌‌దీప్ తొలి రెండు బాల్స్‌‌ను డాట్‌‌ చేయడంతో టెన్షన్‌‌ అమాంతం పెరిగింది. కానీ, హెట్‌‌మయర్‌‌‌‌ వరుసగా 6, 2, 6 కొట్టి రాయల్స్‌‌ను గెలిపించాడు. 

సంక్షిప్త స్కోర్లు : 

పంజాబ్ : 20 ఓవర్లలో 147/8 (అషుతోశ్‌‌ 31,  జితేశ్‌‌ 29, మహారాజ్ 2/23)
రాజస్తాన్‌‌ : 19.5 ఓవర్లలో 152/7 (యశస్వి 39, హెట్‌‌మయర్ 27*,  రబాడ 2/18, కరన్ 2/25).