కనిపించి మాయమైన తాడేపల్లి గ్యాంగ్ రేప్ నిందితుడు

కనిపించి మాయమైన తాడేపల్లి గ్యాంగ్ రేప్ నిందితుడు
  • తాడేపల్లి రైల్వే ట్రాక్ వద్ద తచ్చాడుతుండగా గుర్తించిన స్థానికులు
  • కేకలు వేసి పట్టుకునేందుకు ప్రయత్నించగా గూడ్స్ రైలు ఎక్కి పరార్
  • నిందితులను పట్టుకునేందుకు కొనసాగుతున్న పోలీసుల వేట

అమరావతి: తాడేపల్లి వద్ద గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు కనిపించినట్లే కనిపించి మాయమైపోయాడు. తాడేపల్లి రైల్వే ట్రాక్ బ్రిడ్జి వద్ద కెనాల్ లో స్నానం చేస్తున్న నిందితుడ్ని మత్స్యకారులు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా.. తప్పించుకుని పరారయ్యాడు. అక్కడి నుండి తాడేపల్లి రైల్వే ట్రాక్ వద్దకు వచ్చి.. కృష్ణ కెనాల్ జంక్షన్ వైపు వెళ్తున్న గూడ్స్ ఎక్కి పరారైనట్లు స్థానికుల సమాచారం. దీంతో పోలీసులు కృష్ణా  కెనాల్ జంక్షన్ వద్డ గూడ్సు ఆగిన వెంటనే ప్రతి బోగీ సోదా చేయగా.. నిందితుడు కనిపించలేదు. 
సీతానగరంకు చెందిన కృష్ణ, వెంకటేష్ లే ప్రధాన నిందితులు..?
తాడేపల్లి గ్యాంగ్ రేప్ బాధితురాలు తన కాబోయే భర్తతో ఈనెల 19వ తేదీన కృష్ణా నది తీరానికి రాగా.. నిందితులు బ్లేడ్లతో దాడి చేసి గాయపరిచి, అనంతరం ఆమె కాబోయే భర్తను తాళ్లతో బంధించి.. అతడి ఎదుటే యువతిపై అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. ఇద్దరి వద్ద మొబైల్ ఫోన్లు, చెవి దుద్దులు, డబ్బులు తీసుకుని నాటు పడవలో కృష్ణా నదిలో పరారైపోయాక బాధితులిద్దరూ రోడ్డుపైకి వచ్చి స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేకెత్తించింది. ఘటనపై పెద్ద ఎత్తున దుమారం చెలేరేగిన నేపధ్యంలో పోలీసులు అనేక బృందాలతో విచారణ చేపట్టగా.. సీతానగరం కు చెందిన కృష్ణ, వెంకటేష్ లు ఇద్దరూ ఘటన జరిగినప్పటి నుంచి కనిపించడం లేదు. యువతి, ఆమెకు కాబోయే భర్త దగ్గర లాక్కున్న మొబైల్ ఫోన్లను నిందితులు దాస్ అనే వ్యక్తి వద్ద తాకట్టుపెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఘటన జరిగినప్పటి నుంచి వీరు పరారీలోనే ఉండడంతో వీరే ప్రధాన నిందతులన్న అనుమానాలు బలపడుతున్నాయి.
స్థానికంగానే సంచరిస్తున్న నిందితులు
గ్యాంగ్ రేప్ నిందితుల్లో మహానాడు కరకట్టకు చెందిన ఓ నిందితుడు  మంగళవారం మధ్యాహ్నం తన బంధువులను కలసి వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. నిన్నటి నుంచి ఓనిందితుడి తల్లి ఆచూకీ లేకుండా పోవడంతో ఆమె నిందితుల వద్దకే వెళ్లి ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి. తాడేపల్లి రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు అణువణువు గాలించగా.. సమీపంలోని ముళ్ల పొదల్లో నిందితుడికి చెందిన దుస్తులు కనిపించాయి. దీంతో నిందితులు ఘటన జరిగినప్పటి నుంచి ముళ్ల పొదల్లోనే తలదాచుకుంటున్నట్లు అర్థం అవుతోంది. రాత్రుల సమయాల్లో బయటకు వచ్చి ఆహారం కొనుక్కుని తిరిగి పొదల్లోనే గడుపుతున్నట్లు గుర్తించారు. సీతానగరంకు చెందిన కృష్ణ, వెంకటేష్ లు అఘాయత్యానికి పాల్పడగా.. వీరికి మరికొందరు నాటు పడవలో ఉంటే సహకరించారని.. పారిపోయేందుకు వారే మార్గం చూపించారన్న అనుమానాలు బలపడుతున్నాయని పోలీసు వర్గాల కథనం. 
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బాధితురాలి డిశ్చార్జ్
అత్యాచార బాధితురాలు నిన్న గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనకు కాబోయే భర్త ఎదుటే గ్యాంగ్ రేప్ చేయడంతో శారీరకంగా అయిన గాయాలకు చికిత్స చేసి నయం చేసినా.. మానసికంగా కుంగిపోయిన బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు దిశ మహిళా పోలీసు అధికారులు కౌన్సెలింగ్ ఇప్పించారు. ఇలాంటి ఘటనలను సవాల్ గా తీసుకుని భవిష్యత్తులో మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా చూసే బాద్యత తీసుకుంటే సమాజం గర్విస్తుందని యువతికి హితబోధ చేసినట్లు చెబుతున్నారు. కాగా బాధితురాలు ఆస్సత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో కేసు విచారణ వేగవంతం అవుతందని పోలీసులు భావిస్తున్నారు. పాత నేరస్తుల సహాయంతో నేరస్తుల ఆనవాళ్లను ఆమె వివరిస్తే దానికి అనుగుణంగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.