గచ్చిబౌలిలో ఠాగూర్ సీన్.. డబ్బుల కోసం శవానికి ట్రీట్‌మెంట్

గచ్చిబౌలిలో ఠాగూర్ సీన్.. డబ్బుల కోసం శవానికి ట్రీట్‌మెంట్
  •     పేషెంట్​ను చూడనివ్వకుండా  
  •        మరో రూ.4.50 లక్షలు డిమాండ్​
  •     ఐసీయూ అద్దాలు పగలగొట్టి    లోపలకు వెళ్లిన బంధువులు  
  •     అప్పటికే చనిపోయి ఉన్న రోగి
  •     గచ్చిబౌలి కేర్​ దవాఖానలో ఘటన 

గచ్చిబౌలి, వెలుగు : గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్​హాస్పిటల్​ డాక్టర్లు శవానికి ట్రీట్​మెంట్​ఇస్తూ కుటుంబసభ్యుల దగ్గర డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. డాక్టర్ల తీరుపై అనుమానం వచ్చి ఐసీయూ అద్దాలు పగలగొట్టి వెళ్లి చూడగా అప్పటికే  చనిపోయి ఉన్నాడు. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మెదక్ ​జిల్లా నర్సాపూర్​కు చెందిన వెంకటేశ్​(50) క్యాన్సర్​తో బాధపడుతున్నడు. దీంతో కొద్ది రోజుల కింద గచ్చిబౌలిలోని కేర్​ హాస్పిటల్​లో జాయిన్​ చేశారు. గత శుక్రవారం సర్జరీ చేశారు. అపరేషన్​ కోసం రూ.5.50 లక్షలు తీసుకున్నారు.

రెండు రోజుల్లో డిశ్చార్జ్​ చేస్తామని చెప్పారు. గురువారం నుంచి వెంకటేశ్​  ను చూడడానికి అనుమతించడం లేదు. దీంతో వారిలో అనుమానం మొదలైంది. వెంకటేష్​ను చూపెట్టాలని బతిమిలాడినా వినిపించుకోలేదు. వెంకటేశ్​కు ట్రీట్​మెంట్​ అవసరమని, మరో రూ.4.50 లక్షలు కట్టాలని చెప్పారు. దీంతో ఏదో జరిగిందని భయపడ్డ వెంకటేశ్​ బంధువులు శుక్రవారం ఐసీయూ అద్దాలు పగులగొట్టుకొని లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే వెంకటేశ్​చనిపోయి ఉన్నాడు. దీంతో ఆగ్రహం చెందిన కుటుంబీకులు దవాఖాన ఎదుట ఆందోళన చేశారు. డబ్బుల కోసం శవానికి  ట్రీట్మెంట్​చేశారని ఆరోపించారు. ఘటనపై ఎలాంటి కేసు నమోదుకాలేదు.