పంజ్‌షీర్‌‌లో తాలిబాన్‌ జెండా.. రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ కీలక నేతల హతం

పంజ్‌షీర్‌‌లో తాలిబాన్‌ జెండా.. రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ కీలక నేతల హతం

అప్గానిస్థాన్‌లో తాలిబాన్లపై పోరాడేందుకు ఆ దేశ సైన్యం సైతం వెనుకడుగేసినా సరే.. ఒకే ఒక్క ప్రావిన్స్ మాత్రం భయపడకుండా పంజా విసిరింది. అదే పంజ్‌షీర్‌‌ ప్రావిన్స్‌. అహ్మద్ మసౌద్‌ నేతృత్వంలోని రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ తిరుగులేని పోరాటం చేసింది. ప్రాణాలు ఉండగా తాలిబాన్లకు లొంగబోమని ప్రకటించారు. దీంతో తాలిబాన్లు ఎలాగైనా ఆ ప్రాంతాన్ని తమ వశం చేసుకోవాలని పంజ్‌షీర్‌‌ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. అయినా సరే ధైర్యం సడలకుండా హోరాహోరాగా పోరాడారు పంజ్‌షీర్ రెబల్స్‌. నిన్న ఏకంగా 600 మంది తాలిబాన్లను మట్టుబెట్టారు. కానీ ఒక్క రోజులోనే పరిస్థితి అంతా తారుమారైపోయింది. తాలిబాన్ల ముప్పేట దాడికి రెసిస్టెన్స్‌ ఫోర్స్ నిలవలేకపోయింది. పంజ్‌షీర్‌‌ను తాలిబాన్ల గుప్పెట్లోకి వెళ్లకుండా రెబల్స్‌ కాపాడుకోలేకపోయారు.  ఈ రోజు ఉదయం పంజ్‌షీర్‌‌ను తమ కైవసం చేసుకున్నట్టు తాలిబాన్లు ప్రకటించారు. పంజ్‌షీర్‌‌ గవర్నర్ బిల్డింగ్‌పై తాలిబాన్ జెండాను కూడా ఎగురవేశారు. దీంతో అఫ్గాన్‌ మొత్తం తమ ఆధీనంలోకి వచ్చిందని, రెబల్స్ అడ్డాగా ఉన్న పంజ్ షీర్‌‌ను తాము కైవసం చేసుకున్నామని తాలిబాన్ల అధికార ప్రతినిధి తబీహుల్లా ముజాహిద్ ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. శత్రువులు తల దాచుకున్న పంజ్ షీర్ ను తాము టేకోవర్ చేశామన్నారు. ఇప్పుడు పంజ్ షీర్ పూర్తిగా తమ ఆధీనంలో ఉందని.. కొందరు రెబల్స్ ని చంపేశామని.. మరికొందరు పారిపోయారని తెలిపారు. పంజ్ ప్రజల భద్రతకు హామీ ఇస్తున్నామన్నారు తాలిబాన్లు. అక్కడి ప్రజలపై వివక్ష చూపబోమని, వారంతా తమ సోదరులేనని చెప్పారు. 

ఇదంతా పాకిస్థాన్‌ సృష్టించిన రక్తపాతమే..

పంజ్‌షీర్‌‌ను కైవసం చేసుకునే క్రమంలో తమకు అడ్డుగా నిలిచి పోరాడిన రెసిస్టెన్స్ ఫోర్స్‌ కీలక నేతలను తాలిబన్లు చంపేశారు. రెసిస్టెన్స్ ఫోర్స్ అధికార ప్రతినిధి ఫహీం దష్తీ, అహ్మద్ మసౌద్ సన్నిహితుడు జనరల్ అబ్దుల్ వదూద్ ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అలాగే స్పెషల్ ఫోర్సెస్ కమాండర్ మునీబ్ అమిరి, జనరల్ జల్ హైదర్ కూడా చనిపోయినట్టు అఫ్గనిస్థాన్‌ మీడియా చెబుతోంది. రెసిస్టెన్స్ ఫోర్స్ చీఫ్ అహ్మద్ మసౌద్‌కు వీరంతా చాలా సన్నిహితులు. అయితే పంజ్‌షీర్‌‌ను కైవసం చేసుకోవడం తాలిబాన్ల పోరాటంతో సాధ్యం కాలేదని తెలుస్తోంది. పాకిస్థాన్ సాయం తీసుకుని పంజ్‌షీర్‌‌లో రక్తపాతం సృష్టించి, ఆ ప్రావిన్స్‌ను ఆక్రమించినట్లు వార్తలు వస్తున్నాయి. రెండ్రోజుల క్రితం పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ చీఫ్​ కాబూల్ వెళ్లి తాలిబాన్లతో సమావేశం కావడం వెనుక కారణం కూడా ఇదేనని అంతర్జాతీయ మీడియాలో రిపోర్ట్ వెలువడుతున్నాయి. పంజ్‌షీర్‌‌ను కైవసం చేసుకోవడం కోసం పాక్‌ సైన్యం సాయం కోరడంతో అందుకు అంగీకరించి, పాకిస్థాన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ను రంగంలో దించారని, డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తూ అటాక్‌ చేస్తే వెంట తాలిబాన్లు తుపాకులతో పంజ్‌షీర్‌‌ రెసిస్టెన్స్ ఫోర్స్‌ను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ అఫ్గాన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్‌ సన్నిహుతుడు ఒకరు కామెంట్స్ చేశారు. తాలిబాన్లకు పాక్ ఎయిర్‌‌ఫోర్స్ సాయం చేస్తోందని, రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ను ఎదుర్కొనేందుకు పాక్ ఎయిర్‌‌ఫోర్స్‌ చాపర్స్‌ దాడులు చేశాయని చెప్పారు. అయితే రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ పోరాటం అప్పుడే ముగిసిపోయిందని చెప్పలేమని, పంజ్‌షీర్ పూర్తిగా తమ వశమైందని తాలిబాన్లు చేస్తున్న ప్రకటనను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.