కాబూల్‌లో డ్రోన్ అటాక్స్‌.. ఏడుగురి మృతి: అమెరికాపై తాలిబాన్ సీరియస్

కాబూల్‌లో డ్రోన్ అటాక్స్‌.. ఏడుగురి మృతి: అమెరికాపై తాలిబాన్ సీరియస్

కాబూల్‌: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ ఎయిర్ పోర్ట్ దగ్గర యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఎయిర్ పోర్ట్ ను టార్గెట్ చేస్తూ రాకెట్ దాడులు జరిగాయి. 5 రాకెట్లు ఎయిర్ పోర్ట్ పైకి దూసుకొచ్చాయి. అయితే మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో ఆ రాకెట్లను కూల్చేసినట్లు అమెరికా తెలిపింది. ఎయిర్ పోర్ట్ పైకి రాకెట్లు దూసుకొచ్చిన విషయాన్ని ప్రెసిడెంట్ జో బైడెన్ కు వివరించారు రక్షణ అధికారులు. అయితే ఎయిర్ పోర్ట్ లో సేవలు కొనసాగుతున్నాయని... ఎక్కడా అంతరాయం లేదని  అమెరికా స్పష్టం చేసింది.

మాకు సమాచారం లేకుండా అమెరికా దాడులేంటి?

కాబూల్‌లో మరో సూసైడ్ బాంబ్ అటాక్ జరిగే ప్రమాదం ఉందని అనుమానితులపై అమెరికా డ్రోన్ అటాక్ చేసిందని, ఇందులో ఏడుగురు అఫ్గాన్‌ పౌరులు మరణించారని తాలిబాన్లు తెలిపారు. ఈ విషయంపై తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చైనాకు చెందిన సీజీటీఎన్‌ చానెల్‌తో మాట్లాడాడు. అమెరికా చేసిన డ్రోన్ అటాక్‌లో ఏడుగురు ప్రజలు చనిపోయారని, విదేశీ గడ్డపై ఇలా అమెరికా అటాక్స్ చేయడం చట్ట విరుద్ధమని అన్నాడు. అఫ్గాన్‌లో ఏదైనా దాడులు జరిగే ప్రమాదం ఉందని తెలిస్తే అమెరికా ముందుగా తమకు రిపోర్ట్ చేయాలని, అలా చేయకుండా సొంతంగా దాడి చేసి పౌరుల మృతికి కారణమవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

విచారణ చేస్తున్నాం: పెంటగాన్‌

కాబూల్‌ ఎయిర్‌‌పోర్టుపై కారుతో సూసైడ్ బాంబ్ అటాక్‌ జరిగే చాన్స్ ఉందని తమ ఇంటెలిజెన్స్‌ సమాచారం సేకరించిందని అమెరికా డిఫెన్స్ హెడ్‌ క్వార్టర్‌‌ పెంటగాన్‌ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం డ్రోన్ అటాక్స్ చేశామని, అయితే ఈ దాడిలో అఫ్గాన్‌ పౌరులు చనిపోయారన్న వార్తలపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని తెలిపారు. అయితే భారీ పేలుడు పదార్థాలతో ఐఎస్ఐఎస్‌–కే ఇంకా అటాక్స్ చేసే చాన్స్ ఉందని, దీనిపై అప్రమత్తంగా వ్యవహరించాలని పెంటగాన్ హెచ్చరించింది.