
కాబూల్: తాలిబాన్లు పెట్టిన డెడ్‌లైన్ ప్రకారమే ఆగస్టు 31 లోపు అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా తన సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంది. కాబూల్ ఎయిర్‌పోర్టులో ఉండి తరలింపు ఆపరేషన్లు చేపడుతున్న చివరి బలగాలు కూడా సోమవారం రాత్రి వెళ్లిపోయారు. దీంతో మంగళవారం ఉదయం తాలిబాన్ ప్రతినిధులు కాబూల్ ఎయిర్‌పోర్టులో రన్ వేపై నిలబడి మీడియాతో మాట్లాడారు. ఇది అఫ్గాన్లందరి విజయం అంటూ ప్రకటించారు. ‘‘అఫ్గాన్లందరికీ కంగ్రాట్స్.. ఈ విజయం మనందరిదీ” అని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నాడు. ప్రపంచం తమ విజయం నుంచి పాఠం నేర్చుకోవాలని, ఇది తమకు ఎంతో సంతోషకరమైన సమయమని చెప్పాడు. అమెరికాతో పాటు అన్ని దేశాలతో తాము మంచి రిలేషన్స్ నెలకొల్పాలని కోరుకుంటున్నామని, అన్ని ప్రపంచ దేశాలతోనూ మంచి దౌత్య సంబంధాలను పెట్టుకోవాలని అనుకుంటున్నామని వివరించాడు.