పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్: రూ. వెయ్యి నగదు ఇవ్వకపోవడంపై.. ప్రతిపక్షాలు ఆగ్రహం

పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్: రూ. వెయ్యి నగదు ఇవ్వకపోవడంపై.. ప్రతిపక్షాలు ఆగ్రహం

తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని బియ్యం కార్డు దారులతో పాటు శ్రీలంక తమిళుల పునరావాస శిబిరాల్లో నివసిస్తున్న వారికి పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ లోని వస్తువులను జాబితాను వెల్లడించింది. ఈ గిఫ్ట్ హ్యాంపర్‌లో ఒక కిలో బియ్యం, ఒక కిలో చక్కెర, ఒక చెరకు గడ ఉన్నాయి. ఈ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం రూ.238.92 కోట్లు కేటాయించింది. 2023 మాదిరిగా కార్డు హోల్డర్లకు ప్రభుత్వం ఎలాంటి నగదును ప్రకటించకపోవడంతో ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్‌తో పాటు కార్డు హోల్డర్లందరికీ రూ.1,000 అందించాలని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రామదాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఇది పేదలను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా నగదు సాయం నిలిపేయడాన్ని ఖండిస్తున్నామని రామదాస్ అన్నారు. ఇప్పటికే చెన్నై , దక్షిణాది జిల్లాల వరద బాధిత ప్రజలకు రూ.6వేల ఆర్థిక సహాయం అందించడంలో అవకతవకలు జరిగాయని, అర్హులైన అనేక మంది మహిళా కుటుంబ పెద్దలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.1,000 నెలవారీ సాయం అందలేదని పీఎంకే నేత ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పొంగల్ కానుకతో పాటు రూ.1000 అందించకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు.