- రూ. 1600 కోట్ల ‘పార్టీ ఫండ్’ దందాపై కఠిన చర్యలు
చెన్నై: తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)లో గత కొంతకాలంగా చోటుచేసుకున్న భారీ ఆర్థిక అవకతవకలపై ఆ రాష్ట్ర సీఎం జోసెఫ్ విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్మాక్ నిధుల లీకేజీ, అనధికారిక వసూళ్లు, అక్రమ పార్టీ ఫండ్ వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విజయ్ అధ్యక్షతన ఆదివారం తొలిసారి నిర్వహించిన కేబినెట్ సమావేశంలో టాస్మాక్‌పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం దుకాణాల నుంచి ‘పార్టీ ఫండ్’ పేరుతో అనధికారికంగా సాగుతున్న వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని, మద్యం అమ్మకాలపై వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకే చేరాలని అధికారులను ఆదేశించారు. గత ఐదేండ్లలో దాదాపు రూ.1,600 కోట్ల ప్రభుత్వ సొమ్ము ఇలా పక్కదారి పట్టిందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేయగా.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయ్ నిర్ణయించారు.
నెలకు రూ.102 కోట్ల ‘మామూళ్ల’ దందా!
టాస్మాక్ సరఫరా వ్యవస్థలో దాదాపు 2 దశాబ్దాలుగా ఈ ‘పార్టీ ఫండ్’ వసూళ్లు ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లా మారిపోయాయని, హోల్‌సేల్, రీటెయిల్ వ్యాపారంలో ప్రతి లిక్కర్ కేస్‌పై రూ.90, బీర్ కేస్‌పై రూ.40, వైన్ కేస్‌పై రూ.20 చొప్పున రాజకీయ, మంత్రివర్గ నిధుల పేరిట దండుకుంటున్నట్టు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో నెలకు సగటున 88 లక్షల మంది వినియోగదారులు మద్యం కొనుగోలు చేస్తుండగా.. రూ.102 కోట్లకు పైగా నిధులు ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నట్టు నివేదించారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం విజయ్.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,048 రిటైల్ ఔట్‌లెట్లలో ఈ అక్రమ వసూళ్ల వ్యవస్థను తక్షణమే రూపుమాపాలని ఆదేశించారు. ‘‘అవినీతి ద్వారా.. ప్రజలను బాధపెట్టడం ద్వారా వచ్చే ఆదాయం మా ప్రభుత్వానికి అవసరంలేదని కేబినెట్ భేటీలోనే సీఎం స్పష్టం చేశారు. లీకేజీలను అరికట్టి, ప్రజల సొమ్మును తిరిగి ఖజానాకు చేర్చడమే మా లక్ష్యం’’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి కె. విఘ్నేశ్ పేర్కొన్నారు.
