నటిపై అత్యాచారం కేసులో మాజీ మంత్రి అరెస్ట్

నటిపై అత్యాచారం కేసులో మాజీ మంత్రి అరెస్ట్

చెన్నై: తమిళ నటి, మలేసియా పౌరసత్వం ఉన్న చాందిని పై అత్యాచారం కేసులో మాజీ మంత్రి ఎం.మణికందన్ ను చెన్నై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కేసు నమోదుతో బెంగళూరుకు వెళ్లిపోయిన ఆయనను అరెస్టు చేసి తీసుకొస్తున్నట్లు చెన్నై పోలీసులు ధృవీకరించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న మణికందన్ పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి ఐదేళ్లు సహజీవనం చేశాడని చాందిని మీడియా సమావేశం పెట్టి ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. తనతో పెళ్లి గురించి అడిగితే అదిగో ఇదిగో అంటూ మూడుసార్లు గర్భస్రావం చేయించాడని.. పెళ్లి మాటెత్తితో చంపేస్తానని..  మొత్తం కుటుంబాన్ని అంతం చేస్తానని కిరాయి మనుషులతో బెదిరింపులకు దిగుతున్నాడని చాందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు,వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి మరీ వాడుకుని మోసం చేశాడని చాందిని మీడియా ఎదుట కంటతడిపెట్టుకుని విలపించిన విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన స్టాలిన్ ప్రభుత్వం హయాంలో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఆమె ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మాజీ మంత్రి చాందిని ఎవరో తనకు తెలియదని కొట్టివేసే ప్రయత్నం చేశారు.

మణికందన్  వ్యవహారంపై  మీడియా మరిన్ని ఫోటోలు, వీడియోలతో పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రసారం చేయడంతో ఇబ్బందికరపరిస్థితులు ఎదుర్కొన్నాడు. తమిళనాడులో ఉంటే అరెస్టు తప్పదని భావించి బెంగళూరుకు వెళ్లి తలదాచుకున్నట్లు సమాచారం. చెన్నై పోలీసులు ఆయన కదలికలను పసిగట్టి బెంగళూరుకు వెళ్లి అరెస్టు చేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు మాజీ మంత్రి మణికందన్ ముందస్తు బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసుకోగా మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.