
- హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో విద్యా విధానం
- ఆవిష్కరించిన సీఎం స్టాలిన్
- సైన్స్, ఏఐ, ఇంగ్లిష్‌కే ప్రాధాన్యం
- ఇంటర్ మార్కుల ఆధారంగా డిగ్రీలో అడ్మిషన్లు
చెన్నై: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)కి ప్రత్యామ్నాయంగా తమిళనాడు సర్కారు కొత్తగా రాష్ట్ర విద్యావిధానాన్ని ఆవిష్కరించింది. జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలోని 14 మంది సభ్యుల ప్యానెల్ రూపొందించిన స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎస్‌ఈపీ)ని సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం విడుదల చేశారు. ఎన్‌ఈపీలోని త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా కొత్త విధానం రూపొందించారు.
ఇందులో ద్విభాషా విధానానికి ప్రాధాన్యతనిచ్చారు. 2022 లో ఏర్పాటైన మురుగేశన్ నేతృత్వంలోని 14 మంది సభ్యుల కమిటీ కిందటేడాది కొత్త పాలసీ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ సిఫార్సులను పరిశీలించిన స్టాలిన్ సర్కారు తాజాగా పాలసీని ఆవిష్కరించింది.
పబ్లిక్ పరీక్షలు, ఎంట్రెన్స్‌లు వద్దు..
మాతృభాష తమిళంతో పాటు ఇంగ్లిస్, ఏఐ, సైన్స్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త పాలసీని రూపొందించారు. 3,5,8వ తరగతి పిల్లలకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలన్న ఎన్‌ఈపీ ప్రతిపాదనని ఎస్‌ఈపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అది పిల్లల డ్రాపౌట్లను పెంచుతుందని, విద్యను కార్పొరేటీకరణ చేస్తుందని కమిటీ అభిప్రాయపడింది.
ఎంట్రెన్స్ ద్వారా కాకుండా 11,12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా డిగ్రీలో అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. విద్యను ఉమ్మడి జాబితా నుంచి తొలగించి రాష్ట్ర జాబితాలో చేర్చాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే, మాతృభాషతోపాటు ఇంగ్లిష్, హిందీని తప్పనిసరి చేస్తూ రూపొందించిన ఎన్‌ఈపీలోని త్రిభాషా విధానం అమలుపై కేంద్రం, తమిళనాడు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది.
హిందీని తమపై రుద్దడాన్ని అంగీకరించబోమని స్టాలిన్ సర్కారు చెప్తూవస్తోంది. ఈ క్రమంలోనే కొత్త పాలసీని రూపొందించింది. ఎన్‌ఈపీని వ్యతిరేకిస్తున్నందుకు కేంద్రం సమగ్ర శిక్ష పథకం కింద రావాల్సిన రూ.2,152 కోట్లు నిలిపివేసిందని తమిళనాడు సర్కారు ఆరోపిస్తోంది. దీనిపై ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, కేంద్రం 1,000 కోట్లిచ్చినా తాము ఎన్‌ఈపీని అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఎంత ఒత్తిడి చేసినా రాష్ట్రంలో విద్యా స్వేచ్ఛను కొనసాగిస్తామని చెప్పారు.