ఆలయ నిధులను సర్కారు.. వ్యాపారంగా మార్చొచ్చా?

ఆలయ నిధులను సర్కారు.. వ్యాపారంగా మార్చొచ్చా?
  • మద్రాస్ హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో..

రాజ్యాంగంలోని ఆర్టికల్​ 25 వ్యక్తి స్వేచ్ఛగా జీవించే,  స్వేచ్ఛగా వృత్తి చేసుకునే అవకాశం ఇస్తుంది. ఆర్టికల్ 26 మతపరమైన వ్యవహారాలను నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ప్రతివర్గం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించడానికి, వాటిని నిర్వహించడానికి, వాటికి ఆస్తిని కలిగి ఉండటానికి హక్కు కలిగి ఉండొచ్చు.  మొదటి నుంచీ ప్రభుత్వం హిందూ దేవాదాయ ధర్మాదాయ ఆదాయం, ఆస్తుల పైనే దృష్టి సారించింది.  నిజానికి దాతలు దేవాలయాలకు భూములు, ఆస్తులు, నగదు, బంగారం, ఇతర కానుకలు  ఒక ప్రయోజనం ఆశించి   దానం చేస్తారు.   

దేవాలయాలలో నిత్య ధూప, దీప, నైవేద్యాలు సక్రమంగా జరగటానికి,  ఆలయాలను ఆశ్రయించి జీవిస్తున్న అర్చక, సేవక, పరివారానికి భుక్తి కోసం,  ధార్మిక కార్యక్రమాలకు, ధార్మిక సమాజ సేవకు, దేవాలయాల మనుగడ కోసం ఇస్తారు. అయితే, ప్రభుత్వాలు ఆయా కానుకలను,  ఆదాయాలను, భూములను ఇష్టారాజ్యంగా వాడుతున్నాయి.  దేవాలయ నిధులను మత సంబంధమైన లేదా ధార్మిక కార్యక్రమాల కోసం మాత్రమే వినియోగించాలని, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం చట్టవిరుద్ధమని మద్రాస్ ​హైకోర్టు స్పష్టం చేసింది.ధార్మిక నిధులు లాభాల కోసం కాదు రాష్ట్రంలోని 27 దేవాలయాల సమీపంలో  రూ. 80 కోట్ల దేవాలయ నిధులతో కల్యాణ మండపాలు నిర్మించి, వాటిని అద్దెకు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను కోర్టు తిరస్కరించింది. 

దేవాలయ నిధులు  దేవాలయ  నిర్వహణ, ఆచారాలు,  ఉత్సవాలు,  పేదలకు ఆహారం, లేదా అవసరమైన భక్తులకు సాయం వంటి మతపరమైన లేదా ధార్మిక కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించాలని కోర్టు స్పష్టం చేసింది.  భక్తులు దానం చేసే నిధుల వెనుక భక్తి ఉద్దేశం ఉంటుందని, లాభంకోసం కాదని న్యాయస్థానం నొక్కి చెప్పింది. ప్రభుత్వానికి నచ్చినట్లుగా కల్యాణ మండపం కట్టి.. అద్దెకు ఇవ్వడం వాణిజ్య ఉద్దేశంగా మారుతుందని, ఇది ధార్మిక లేదా మతపరమైన ఉద్దేశం కాదని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులోని ఐదు దేవాలయాల నిధులను ఉపయోగించి కల్యాణ మండపాలు నిర్మించడానికి 2023–25 మధ్య జారీ చేసిన ఐదు ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ రామ రవి కుమార్ అనే యాక్టివిస్ట్ పిటిషన్లు దాఖలు చేశాడు. తమిళనాడులో 36 వేలకు పైగా దేవాలయాలు, 56 మఠాలు, అనేక ట్రస్టులు ఉన్నాయని వాటి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆయన కోర్టును ఆశ్రయించగా, కోర్టు ప్రభుత్వ ప్రతిపాదనలను కొట్టేసింది. ఆలయాల నిధులు ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వాడటం కుదరదని తేల్చి చెప్పింది.

23% దేవాదాయ భూముల ఆక్రమణలు

తెలంగాణలో దేవాదాయ శాఖ పరిధిలో సుమారు 5,500 దేవాలయాలు ఉన్నాయి. ఎండోమెంట్స్ యాక్ట్ 1987 ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ దేవాలయాలను వాటి వార్షిక ఆదాయాన్ని బట్టి ఏ, బీ, సీ కేటగిరీలుగా ప్రభుత్వం వర్గీకరించింది. ప్రభుత్వం వీటిని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని చట్టం స్పష్టం చేస్తోంది. తెలంగాణలో దేవాదాయ శాఖకు 87,235 ఎకరాల భూమి ఉంది. 

కాగ్​ రిపోర్ట్​ ప్రకారం.. ఇందులో 20,124 ఎకరాలు అంటే సుమారు 23% ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయి.  దేవాలయ భూముల్లో నిర్మించిన కమర్షియల్​ కాంప్లెక్స్​లు, దుకాణాల అద్దె ఆదాయం గణనీయంగా ఉంటుంది. కానీ సరైన నిర్వహణ లేకపోవడం, అడిగే నాథుడు లేకపోవడం వల్ల ఇష్టా రాజ్యంగా నడుస్తోంది.  హిందూ ఆలయాల ఆదాయాన్ని వాటి అభివృద్ధికి, ధార్మిక, సామాజిక సేవా  కార్యక్రమాలకే ఖర్చు చేయాలని  చెప్పిన మద్రాస్​ హైకోర్టు తీర్పును దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి.

- బచ్చు శ్రీనివాస్,  
  సౌత్ ఇండియా వైశ్య యూత్ పరిషత్​