తమిళనాడు వస్త్ర వ్యాపారుల టోకరా

తమిళనాడు వస్త్ర వ్యాపారుల టోకరా
  • కరీంనగర్ జిల్లాలో వస్త్ర ఉత్పత్తిదారులకు రూ.1.50 కోట్ల మోసం 

గంగాధర, వెలుగు :  కరీంనగర్ జిల్లాలో వస్త్ర ఉత్ప త్తిదారుకుల తమిళనాడుకు చెందిన వ్యాపారులు రూ.1.50 కోట్లు టోకరా వేసి పారిపోయారు.  పోలీసు లు, బాధితుల కథనం మేరకు.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పెరుగోపనపల్లి చెందిన వినోద్​రాజ్ మరో ఇద్దరితో కలిసి గంగాధర మండలం గర్శకుర్తిలో ఆపిల్ టెక్స్​టైల్స్ హోల్​సేల్ డీలర్స్ పేరిట 8 నెలల కింద ఆఫీసు తెరిచారు. అక్కడే అద్దెకు ఉంటున్నారు. 

 స్థానిక వస్త్ర ఉత్పత్తి దారుల వద్ద చీరలు, టవల్స్, కర్చీఫ్స్​, రెడీమెడ్ డ్రెస్సులు కొనుగోలు చేశారు. వాటికి కొంత నగదుగా.. మరికొంత అమౌంట్​ చెక్కుపై రాసిచ్చారు. ఇలా  వినోద్ రాజ్ ముఠా రూ. కోట్లలో కొనుగోలు చేసింది. బకాయిలు పేరుకుపోవడంతో ఉత్పత్తిదారులు పేమెంట్ కోసం వినోద్​రాజ్​పై ఒత్తిడి చేస్తుండగా.. తమ బాగోతం బయటపడతుందని ముందే తెలిసి మరిన్ని వస్త్రాలను కొనుగోలు చేసుకుని ఈనెల 16న బోలెరోలో వెళ్లిపోయారు. 

వారం రోజులుగా ఆఫీసుకు లాక్ వేసి ఉండడం, ఫోన్​ స్విచ్ఛాఫ్​ వస్తుండడంతో మోసపోయినట్టు గ్రహించారు. గర్శకుర్తికి చెందిన పది మంది  ఉత్పత్తిదారుల నుంచి  రూ.కోటి విలువైన సరుకు కొనుగోలు చేయడంతో  లబోదిబోమంటున్నారు. గర్శకుర్తికి చెందిన మిట్టపెల్లి రాజేశం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.