కాంగ్రెస్ ​ఆరు గ్యారంటీలతో కేసీఆర్​కు భయం: వీరభద్రం

కాంగ్రెస్ ​ఆరు గ్యారంటీలతో కేసీఆర్​కు భయం: వీరభద్రం

మిర్యాలగూడ/హాలియా, వెలుగు :  మతోన్మాద వ్యతిరేక పార్టీలతో పొత్తుకు సిద్ధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మంగళవారం నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ ఎన్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ముఖ్య నేతల మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. తర్వాత నిడమనూరులో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ స్కీములను ప్రజలు నమ్మడం లేదని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్‌లతో కేసీఆర్‌‌కు భయం పట్టుకుందన్నారు. 

మునుగోడు ఉప ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఇండియా కూటమి ఏర్పాటుతోనే ప్రధాని మోదీ పతనం ప్రారంభమైందని, ఇండియా పేరును భారత్‌గా మార్చడమే ఇందుకు నిదర్శనమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మంచిదే అయినా.. అమలులో  చిత్తశుద్ధి లేదన్నారు. దేశంలో జనగణనతో పాటు కుల గణన జరగాలని డిమాండ్ చేశారు. సీపీఎం దేశవ్యాప్తంగా ఇండియా కూటమితో కలిసి పనిచేస్తుందని, రాష్ట్రంలో పార్టీ నిర్ణయించిన స్థానంలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ లను ఓడించాలని పిలుపునిచ్చారు. 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేశ్,  జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, బండా శ్రీశైలం, చినపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, ఎండీ హషం, జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనందు, ఎండీ సలీం, కొండేటి శ్రీను, అవుతా సైదులు,  ఖమ్మం, నల్గొండ జిల్లా కార్యదర్శలు నున్నా నాగేశ్వర్ రావు, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఐద్వా జిల్లా ప్రిసిడెంట్ పి.వరలక్ష్మి పాల్గొన్నారు.