ఎన్నికలను బహిష్కరించిన రంగం తండా, హజ్నా తండావాసులు

ఎన్నికలను బహిష్కరించిన రంగం తండా, హజ్నా తండావాసులు
  • ఫోన్​లో మాట్లాడి డెవలప్ ​చేస్తామని మాటిచ్చిన మంత్రి  
  • పంచాయతీ చేస్తానని హామీ 

మర్రిగూడ, వెలుగు: మర్రిగూడ మండలంలోని అంతంపేట పరిధిలోగల రంగంతండా, హజ్నాతండా వాసులు గురువారం మునుగోడు ఉప ఎన్నికలో ఓటు వేసేందుకు విముఖత చూపారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ రెండు తండాల్లో కలిపి దాదాపు వంద కుటుంబాలు ఉన్నాయని, మొత్తం 300 మందిమి ఉన్నామని చెప్పారు. తమ తండాకు రోడ్డు లేదని, గ్రామపంచాయతీ చేయలేదని, అభివృద్ధి పనులు జరగలేదని ఈ ఎన్నికలో ఓట్లు వేసేది లేదంటూ మధ్యాహ్నం 3గంటల వరకు గ్రామంలోనే ఆందోళన చేశారు.

మాజీ ఎంపీపీ అనంతరాజుగౌడ్‌‌ ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌‌ దృష్టికి తీసుకుపోయారు. దీంతో ఆయన స్పందించి గిరిజనులతో ఫోన్‌‌లో మాట్లాడారు. ‘చండూరులో ప్రకటించిన విధంగా నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా. గట్టుప్పల్‌‌కు వచ్చిన రోజే మిమ్మల్ని కలిసి గ్రామంలో రోడ్లకు శంకుస్థాపన చేస్తా. రంగాతండా, హజ్నాతండాలను కలిసి గ్రామపంచాయతీగా చేస్తా’ అని హామీ ఇచ్చారు. దీంతో వారు సంతృప్తి చెంది 3.30గంటలకు పోలింగ్‌‌ కేంద్రాలకు చేరుకొని ఓట్లు వేశారు.