సర్వేకు వెళ్లిన అధికారులపై తండావాసుల దాడి

సర్వేకు వెళ్లిన అధికారులపై తండావాసుల దాడి

భూమి సర్వే చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై తండా వాసులు దాడి చేశారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కట్టెల వెంకటాపూర్‭లో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని సర్వేనెంబర్ 55, 56లో మన్నె సుదర్శన్ అనే వ్యక్తి తన భూమి బౌండరీలను చూపించాలని అధికారులను కోరాడు. అయితే.. భూమి సర్వే చేయడం కోసం డీఐఏ శశికుమార్, ఆర్ఐ ప్రభాకర్ సర్వేయర్ సుల్తానా బేగం 55 సర్వే నెంబర్‭లోని భూమి వద్దకు చేరుకున్నారు. వారిని చూసిన రఘవాణి తండావాసులు సర్వేను అడ్డుకుని అధికారులపై దాడి చేశారు. అధికారులు, తండావాసుల మధ్య జరిగిన తోపులాటలో తన బంగారు గొలుసు, మొబైల్ పోయిందని సర్వేయర్ సుల్తానా బేగం ఫిర్యాదు చేశారు. 

తోపులాటలో ప్రైవేట్ ఆపరేటర్ కారు అద్దాలను తండావాసులు పగులగొట్టారని ఆర్ఐ ప్రభాకర్ చెప్పారు. తండా వాసులు దాడికి దిగడంతో అధికారులు అక్కడి నుంచి తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. తమ వద్దకు ఎందుకు వచ్చారంటూ తండావాసులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.