లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తాండూరు సబ్ రిజిస్ట్రార్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తాండూరు సబ్ రిజిస్ట్రార్

వికారాబాద్ జిల్లా: ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్ రిజిస్ట్రార్ జమీరుద్దీన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  టీఆర్ఎస్ పార్టీకి చెందిన తాండూరు వాసి ఇర్షద్ తనకు బాగా తెలిసిన హీర్యా నాయక్ కు 5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీసుకున్న హీర్యా నాయక్ తనకు చెందిన కొంత భూమిని ఇర్షద్ పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ రిజిస్ట్రేషన్ ను క్యాన్సిల్ చేసుకునేందుకు ఇర్షద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించగా పని జరగలేదు. సబ్ రిజిస్ట్రార్ జమీరుద్దీన్ లక్ష రూపాయలు డిమాండ్ చేయడంతో  బాధితుడు ఇర్షద్  ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 


లంచం డబ్బు లక్ష రూపాయలను రెండు విడతలుగా ఇస్తానని సబ్ రిజిస్ట్రార్ జమీరుద్దీన్ తో ఒప్పందం కుదుర్చుకుని ఇవాళ మొదటి విడతగా 50 వేలు రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి లంచం డబ్బును  సీజ్ చేశారు.  వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు.