సంగారెడ్డి జిల్లాలో ఐదు మైనింగ్ కంపెనీలు సీజ్ : రవీందర్ రెడ్డి

సంగారెడ్డి జిల్లాలో ఐదు మైనింగ్ కంపెనీలు సీజ్ : రవీందర్ రెడ్డి
  • అధిక లోడుతో వెళ్తున్న 79 లారీలకు రూ.22 లక్షలు ఫైన్

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలోని పటాన్ చెరు పరిధిలో అక్రమంగా కొనసాగుతున్న ఐదు మైనింగ్ కంపెనీలను గురువారం టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. అలాగే అధిక లోడుతో వెళ్తున్న 79 లారీలకు రూ.22 లక్షలు ఫైన్ వేశారు. గురువారం సంగారెడ్డి ఆర్డివో, టాస్క్ ఫోర్స్ కన్వీనర్ రవీందర్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశాల మేరకు సంగారెడ్డి రెవెన్యు డివిజినల్ పరిధిలో అక్రమ మైనింగ్, చెరువుల సంరక్షణ కమిటీ రిపోర్టు ఆధారంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న మైనింగ్ పై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. పటాన్ చెరు మండలం లక్దారం, జిన్నారం మండలం ఖాజీపల్లి పరిధిలో మొత్తం 78 మైనింగ్ కంపెనీలు నడుస్తున్నాయన్నారు. ఇందులో  5,  మైనింగ్ కంపెనీలు అరుణ స్టోన్స్, శ్రీరామ స్టోన్స్, ఆష్ట్ర రాక్, లారా స్టోన్, కాదా క్రషర్స్ నిబంధనల ప్రకారం పని చేయకపోవడం వల్ల సీజ్ చేశామన్నారు. 

అలాగే అధిక లోడ్ తో వెళ్తున్న 79 వాహనాలను గుర్తించి వాటి యజమానులకు రూ.22 లక్షలు ఫైన్ వేసినట్టు వెల్లడించారు. దీంతోపాటు ఈ ఇష్యూలో 26 పోలీసు కేసులు బుక్ చేయించామన్నారు. నిబంధనలకు విరుద్దంగా వివిధ సంస్థల పేరుతో ఎవరైనా మైనింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవీందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో మైనింగ్ ఏడీ మధు కుమార్, పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇరిగేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రవాణా, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.