పాక్​ ఎకానమీ కంటే..టాటా ​ విలువే ఎక్కువ

పాక్​ ఎకానమీ కంటే..టాటా ​ విలువే ఎక్కువ

న్యూఢిల్లీ: మనదేశపు అతిపెద్ద బిజినెస్​ గ్రూప్​ టాటా కంపెనీల స్టాక్స్​ మార్కెట్​క్యాప్​ 365 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.30.3 లక్షల కోట్ల) దాటింది. ఇది పాకిస్తాన్  జీడీపీ అంచనాల కంటే ఎక్కువ ఉండటం విశేషం!. పాక్​ ఎకానమీ విలువ సుమారు 341 బిలియన్ డాలర్లే! టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్​) విలువ దాదాపుగా 170 బిలియన్ డాలర్ల ( రూ.15 లక్షల కోట్లు)కు చేరింది. ఇది భారతదేశం  రెండవ- అతిపెద్ద కంపెనీగా మాత్రమే కాకుండా, విపరీతమైన అప్పులతో  సతమతమవుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగానికి సమానం.  

టాటా గ్రూప్‌‌లోని మార్కెట్ విలువలో ఇటీవలి పెరుగుదలకు టీసీఎస్​, టైటాన్‌‌, టాటా పవర్​ షేర్లలో బలమైన ర్యాలీలతో పాటు, టాటా మోటార్స్,  ట్రెంట్‌‌లలో భారీ రాబడి కారణమని చెప్పవచ్చు.  కొత్తగా మార్కెట్లో లిస్ట్ అయిన టాటా టెక్నాలజీస్‌‌తో సహా ఎనిమిది టాటా కంపెనీలు ఈ కాలంలో  సంపదను రెట్టింపు చేసుకున్నాయి. ఈ కంపెనీలలో టీఆర్​ఎఫ్​, ట్రెంట్, బెనారస్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్‌‌మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా,  ఆర్ట్‌‌సన్ ఇంజనీరింగ్ ఉన్నాయి. టాటా కెమికల్స్ షేర్​ మాత్రమే గత 12 నెలలుగా తగ్గుతోంది.