టాటా టెక్నాలజీస్​ ఐపీఓ.. సెబీ వద్ద పేపర్లు.. ధర ఇంకా నిర్ణయించలేదు  

టాటా టెక్నాలజీస్​ ఐపీఓ.. సెబీ వద్ద పేపర్లు.. ధర ఇంకా నిర్ణయించలేదు  

ముంబై: టాటా మోటార్స్​ సబ్సిడరీ కంపెనీ టాటా టెక్నాలజీస్​ సెబీ వద్ద ఐపీఓ పేపర్లు ఫైల్​ చేసింది. ఈ ఐపీఓ కింద 8,11,33,706 షేర్లను అమ్మాలని టాటా మోటార్స్ ప్లాన్​ చేస్తోంది. టాటా టెక్నాలజీస్​లో మరో ఇద్దరు షేర్ హోల్డర్లు ఆల్ఫా టీసీ హోల్డింగ్స్, టాటా క్యాపిటల్​ గ్రోత్​ ఫండ్ ​కూడా ఈ ఆఫర్​లో  వాటి వద్ద ఉన్న వాటాలను అమ్మనున్నాయి. టాటా టెక్నాలజీస్​లో వాటా అమ్మకం వల్ల టాటా మోటార్స్​కి డబ్బు రావడంతోపాటు, బాలెన్స్​షీట్​ స్ట్రాంగ్​ అవుతుందని టీసీజీ ఏఎంసీ ఎండి చక్రి లోక ప్రియ చెప్పారు. అమెరికాతో పాటు, ఇతర అడ్వాన్స్​డ్​ మార్కెట్లలోనూ ఈ సెగ్మెంట్​పట్ల ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు. టాటా టెక్నాలజీస్​ ఐపీఓ మంచి పరిణామమేనని అన్నారు. టాటా టెక్నాలజీస్​ కోసం గతంలో ఒక్కో షేరుకు రూ. 7.40 చొప్పున టాటా మోటార్స్​ చెల్లించింది. ఇది ఆఫర్​ ఫర్​ సేల్​ కావడం వల్ల షేర్ల అమ్మకంతో తమ కంపెనీకి డబ్బులేవీ రావని, వాటాదారులకే వెళ్తాయని టాటా టెక్నాలజీస్​ తెలిపింది. ఐపీఓలో షేర్​ ధర ఎంతనేది తర్వాత నిర్ణయించనున్నారు. డిసెంబర్​ 2022 తో ముగిసిన 9 నెలల కాలంలో టాటా టెక్నాలజీస్​ రూ.3,011 కోట్ల రెవెన్యూ మీద రూ. 407 కోట్ల నికర లాభం సంపాదించింది.