టాటా టెక్నాలజీస్ ఐపీఓకు తొలి రోజే ఫుల్​సబ్‌‌స్క్రిప్షన్

టాటా టెక్నాలజీస్ ఐపీఓకు తొలి రోజే ఫుల్​సబ్‌‌స్క్రిప్షన్

న్యూఢిల్లీ: టాటా టెక్నాలజీస్ ఐపీఓకు మొదటిరోజే భారీ ఆదరణ దక్కింది.   ఇష్యూ సైజు రూ. 3,042.51- కోట్లు కాగా, టాటా గ్రూప్​కు గత 20 సంవత్సరాలలో ఇదే మొదటి పబ్లిక్ ఇష్యూ. బుధవారం సబ్‌‌స్క్రిప్షన్ మొదలు కాగా, ఆఫర్ 6.54 రెట్లు సబ్‌‌స్క్రయిబ్ అయింది. మొత్తం 4.5 కోట్ల షేర్లు అమ్మకానికి ఉండగా, కస్టమర్లు 29.43 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్స్ వేశారు.  రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్​ 5.42 రెట్లు, హెచ్‌‌ఎన్‌‌ఐల పోర్షన్​ 11.69 రెట్లు సబ్‌‌స్క్రయిబ్​ అయింది. క్వాలిఫైడ్ ఇన్‌‌స్టిట్యూషనల్ బయ్యర్లు 4.08 రెట్లు బిడ్ చేశారు. టాటా టెక్నాలజీస్ ఉద్యోగుల కోసం కేటాయించిన భాగం 1.1 రెట్లు బుక్​కాగా, టాటా మోటార్స్ వాటాదారుల వాటా 9.3 రెట్లు బుక్ అయింది. పూణేకు చెందిన ఈ గ్లోబల్ ఇంజనీరింగ్ సేవల కంపెనీ తన ఉద్యోగుల కోసం 20.28 లక్షల షేర్లను,  ప్రమోటర్ అయిన టాటా మోటార్స్ వాటాదారులకు 60.85 లక్షల షేర్లను రిజర్వ్ చేసింది.

గంధార్‌‌ ఐపీఓ జోష్​

 గంధార్ ఆయిల్ రిఫైనరీ ఐపీఓకు బుధవారం బిడ్డింగ్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే పూర్తిగా సబ్​స్క్రయిబ్​అయింది. రూ. 500.69 కోట్ల ఐపీఓ ఆఫర్‌‌లో 2,12,43,940 షేర్ల కోసం 2,96,40,864 షేర్లకు బిడ్స్​వచ్చాయి. ఉదయం 11.40 గంటల వరకు 1.40 రెట్లు సబ్‌‌స్క్రయిబ్​అయింది. రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ల  భాగం 2.01 రెట్లు,  నాన్-ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 1.76 రెట్లు సబ్‌‌స్క్రయిబ్ అయింది. ఈ ఐపీఓలో రూ. 302 కోట్ల వరకు తాజా ఇష్యూ,  1,17,56,910 ఈక్విటీ షేర్ల వరకు ఆఫర్-ఫర్-సేల్ ఉంటుంది. ఆఫర్ శుక్రవారంతో ముగుస్తుంది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్​ను షేరుకు  రూ. 160-–169 మధ్య నిర్ణయించారు. గంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా లిమిటెడ్ మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 150 కోట్ల రూపాయలకు పైగా సేకరించినట్లు తెలిపింది.