టాటాల చేతికి ఎయిరిండియా.?

టాటాల చేతికి ఎయిరిండియా.?

న్యూఢిల్లీ: దాదాపు 87 ఏళ్ల చరిత్ర ఉన్న ఎయిరిండియాను సొంతం చేసుకోవడానికి టాటా గ్రూప్‌‌ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. దీని కొనుగోలు కోసం సింగపూర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌‌తో కలిసి త్వరలోనే బిడ్డింగ్‌‌ వేయనుంది. సంబంధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ఎయిరిండియాతోపాటు ఎయిర్‌‌ఏషియాను విలీనం చేసుకోవడం తదితర అంశాలపై రెండు కంపెనీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఎయిర్‌‌ ఏషియాలో టాటాలకు 51 శాతం వాటా ఉంది. ఎయిరిండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ మాత్రం ఎయిరిండియా సబ్సిడరీ. దీనిని కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్‌‌ మలేషియా ఇండస్ట్రియలిస్టు, ఎయిర్‌‌ ఏషియా బెర్హాద్‌‌ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌‌తో చర్చించింది. ఎయిర్‌‌ ఏషియాలో టోనీకి 49 శాతం వాటా ఉంది. షేర్‌‌హోల్డర్స్‌‌ అగ్రిమెంట్‌‌ ప్రకారం టాటాలు మరో బడ్జెట్‌‌ ఎయిర్‌‌లైన్‌‌లో పది శాతానికి మించి వాటాలు కొనకూడదు. కొనాలనుకుంటే టోనీ అనుమతి కావాలి. ఇందుకోసం రెండు కంపెనీలు త్వరలోనే ఒక ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఎయిరిండియాలో వాటాల కొనుగోలుకు అనుమతించినందుకు, టాటాలు.. ఎయిరిండియాను ఎయిర్‌‌ ఏషియాలో విలీనం చేస్తారు. ఫలితంగా టోనీకి ఇండియా ఏవియేషన్‌‌పై పట్టు పెరుగుతుంది. ఇది ఇద్దరికీ మేలు చేసే ఒప్పందమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

విలీనం తప్పదు

టాటా సన్స్‌‌, టోనీ ఎయిర్‌‌లైన్స్‌‌ కంపెనీ కలిసి 2013లో ఎయిర్‌‌ ఏషియాను మొదలుపెట్టాయి. ఎయిరిండియాను జాతీయం చేయకముందు దానిని టాటాలు నడిపిన సంగతి తెలిసిందే. విస్తారా పేరుతో టాటాలు సింగపూర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌‌తో కలిసి మరో ఎయిర్‌‌లైన్‌‌ కంపెనీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో టాటాలకు 51 శాతం, సింగపూర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. టాటా సన్స్‌‌ చైర్మన్‌‌ చంద్రశేఖర్‌‌ ఇటీవల మాట్లాడుతూ విలీనం చేయకుండా మూడో ఎయిర్‌‌లైన్‌‌ కంపెనీని నడిపే అవకాశం లేదని అన్నారు. విస్తారాతోపాటు ఎయిరిండియా టాటా చేతుల్లో ఉంటే ఏవియేషన్‌‌ మార్కెట్‌‌పై వీరికి గుత్తాధిపత్యం వస్తుంది. ఎయిరిండియా 20 ఇండియన్‌‌ సిటీలకు, 13 ఇంటర్నేషనల్‌‌ సిటీలకు విమానాలు నడుపుతోంది. దీని దగ్గర 25 బోయింగ్‌‌ 737 విమానాలు ఉన్నాయి. ఎయిర్‌‌ ఏషియా దగ్గర 29 ఎయిర్‌‌బస్‌‌ ఏ320 విమానాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇది 21 నగరాలకు సేవలు అందిస్తోంది.   విదేశీ సర్వీసులకు ఇంకా అనుమతులు రాలేదు.