సింగరేణి పరిరక్షణకు ఎంతటి త్యాగానికైనా సిద్ధం : మిర్యాల రాజిరెడ్డి

సింగరేణి పరిరక్షణకు ఎంతటి త్యాగానికైనా సిద్ధం : మిర్యాల రాజిరెడ్డి
  •     టీబీజీకేఎస్​ స్టీరింగ్​ కమిటీ చైర్మన్​ మిర్యాల రాజిరెడ్డి

గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థ పరిరక్షణకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని టీబీజీకేఎస్‌ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి ప్రకటించారు. ఆదివారం గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్మిక హక్కుల సాధన కోసం దశలవారీగా ఉద్యమం చేపట్టనున్నామన్నారు. వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 30 మంది సభ్యులతో రాష్ట్ర స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు.  

ఇందులో చర్చల కమిటీ ప్రతినిధులు, కేంద్ర కమిటీ కార్యవర్గ సభ్యులు, వివిధ డివిజన్ల ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు ఉంటారని వెల్లడించారు. యూనియన్ కార్యకలాపాలు కొనసాగిస్తూనే..  కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు.  ఏప్రిల్ నెలలో యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తామన్నారు.  

అనంతరం శనివారం రాష్ట్ర వర్కింగ్​కమిటీ సమావేశంలో చేసిన తీర్మానాల గురించి వెల్లడించారు. కొత్త ఉద్యోగాల కల్పన కోసం కొత్త గనుల ప్రారంభం, కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం,  గని ప్రమాదాల నివారణకు మెరుగైన రక్షణ చర్యలు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాల పెంపుతో పాటు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని తీర్మానించినట్ల వివరించారు. స్టీరింగ్ కమిటీ నాయకులు నూనె కొమురయ్య, మాదాసి రామమూర్తి, పర్లపెల్లి రవి, ఎల్​.వెంకటేశ్, వడ్డేపల్లి శంకర్, చెల్పూరి సతీశ్, చెలుకలపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.