
అమెరికాలో మారిన పొలిటికల్ పరిస్థితులకు అనుగుణంగా టాప్ టెక్ దిగ్గజం టీసీఎస్ తన బిజినెస్ స్టైల్ మార్చేస్తోంది. ఇకపై కొత్తగా ఎలాంటి హెచ్1బి వీసా హోల్డర్ల హైరింగ్ ఉండబోదని టీసీఎస్ సీఈవో కె.కృతివాసన్ వెల్లడించారు. వాస్తవానికి భారత టెక్ కంపెనీల్లో ఎక్కువగా అమెరికాలోని హెచ్1బి వీసా ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీ టీసీఎస్. 2009 నుంచి 2025 మధ్య కాలంలో ఏకంగా 98వేల 259 మంది టెక్కీలను రిక్రూడ్ చేసింది హెచ్1బి మార్గంలో. కానీ ట్రంప్ కఠిన చర్యలతో పాటు ఇటీవల సెనెటర్ల లేఖతో వివాదం పెద్దదిగా మారుతున్న క్రమంలో టీసీఎస్ యాజమాన్యం అప్రమత్తం అయ్యిందని ప్రస్తుత చర్యలు సూచిస్తున్నాయి.
ఈ క్రమంలోనే కంపెనీ వాస్తవానికి పొందిన హెచ్1బి వీసాల లిమిట్ కంటే తక్కువగా బయటి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటోంది. నెమ్మదిగా అమెరికాలోని టెక్కీలను నియమించుకుంటూ ట్రంప్ దెబ్బగి రూట్ మార్చేసింది. ఒకపక్క భారతదేశంలో భారీ లేఆఫ్స్ కొనసాగిస్తున్న టీసీఎస్ మరోపక్క అమెరికాలో కూడా హెచ్1బి వీసా ఉద్యోగులను తొలగించి అమెరికన్లతో రీప్లేస్ చేయెుచ్చనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రధానంగా ఐటీ సేవల రంగంలో ఉన్న టీసీఎస్ మారుతున్న వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా ఏఐలో భారీ పెట్టుబడులకు వెళుతోంది. ఈ క్రమంలోనే ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు 7 బిలియన్ డాలర్ల వరకు వెచ్చించాలని చూస్తోందని వెల్లడైంది. ఏఐ ఆధారిత సేవలతో క్లయింట్లకు మెరుగైన సేవలను అందించాలని టీసీఎస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అలాగే విదేశాల్లో ఉన్న వ్యాపారాలను బలోపేతం చేయాలని నిర్ణయించింది.
మెుదటి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి తక్కువగా ఉన్నప్పటికీ రెండవ త్రైమాసికంలో మెరుగుపడినట్లు సీఈవో వెల్లడించారు. ఇప్పటి వరకు 6వేల మందిని సరైన మార్గాల్లో సివరెన్స్ పేమెంట్ చేసి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. ఇకపై తమ 100 శాతం ప్రాజెక్టుల్లో ఏఐ వినియోగం ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మెుత్తం 33వేల మంది ఉద్యోగుల్లో దాదాపు 11వేల మంది హెచ్1బి వీసా హోల్డర్లు ఉన్నట్లు కంపెనీ చెబుతోంది. అయితే రానున్న రోజుల్లో వీరి సంఖ్య భారీగా తగ్గొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.