వేల కోట్ల AI ప్రాజెక్ట్ దక్కించుకున్న TCS.. పండగ చేసుకుంటున్న టెక్కీలు

వేల కోట్ల AI ప్రాజెక్ట్ దక్కించుకున్న TCS.. పండగ చేసుకుంటున్న టెక్కీలు

దేశీయ ఐటీ దిగ్గజం TCS యూరప్ మార్కెట్‌లో మరో భారీ జాక్‌పాట్ కొట్టింది. గ్లోబల్ లైఫ్ అండ్ పెన్షన్స్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన ‘కెనడా లైఫ్’ నుంచి వేల కోట్లు విలువైన మెగా డీల్‌ను టీసీఎస్ దక్కించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో కెనడా లైఫ్ సంస్థకు చెందిన ఐటీ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి ఈ మల్టీ-ఇయర్ కాంట్రాక్ట్ కుదిరింది. ఐటీ రంగంలో రిక్రూట్మెంట్స్ మందగించిన సమయంలో కూడా టీసీఎస్ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన మెగా డీల్‌ను సొంతం చేసుకోవడం ఉద్యోగులను సంతోషంలో ముంచేస్తోంది. 

ఈ వ్యూహాత్మక ఒప్పందం ప్రకారం.. బ్రిటన్, ఐర్లాండ్, జర్మనీ సహా యూరప్ అంతటా ఉన్న కెనడా లైఫ్ వ్యాపార కార్యకలాపాలకు టీసీఎస్ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించనుంది. ఇందులో భాగంగా డేటా సెంటర్లు, కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎండ్-యూజర్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్‌ను టీసీఎస్ ఆధునీకరించటంతో పాటు నిర్వహించనుంది. తన సరికొత్త ఏఐ, డిజిటల్ సామర్థ్యాలను ఉపయోగించడం ద్వారా క్లిష్టమైన ఐటీ ప్రక్రియలను ఆటోమేషన్ చేయడం, సిస్టమ్స్ భద్రతను పెంచడం, వినియోగదారులకు అత్యుత్తమ డిజిటల్ అనుభవాన్ని అందించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.  

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి ఏఐ ఆధారిత సాంకేతికత వైపు మొగ్గు చూపుతున్నాయి. తమ వ్యాపార పునాదులను ఆధునీకరించే ప్రయాణంలో టీసీఎస్‌తో చేతులు కలపడం తదుపరి దశ అని కెనడా లైఫ్ యూరప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆఫీసర్ కారోలిన్ దిబ్స్ అభిప్రాయపడ్డారు. తమ భవిష్యత్తు ప్రణాళికలను అర్థం చేసుకునే భాగస్వామి ముఖ్యమని, టీసీఎస్ వద్ద ఉన్న సాంకేతిక నైపుణ్యం తమ వ్యూహాలకు ఎంతో బాగా సరిపోతుందని ఆయన అన్నారు.

►ALSO READ | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్ల నష్టాలకు కారణాలు ఇవే

ఈ మెగా ప్రాజెక్ట్ సాధించడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ-ఆధారిత టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీగా ఎదగాలనే తన లక్ష్యానికి టీసీఎస్ మరో అడుగు దగ్గరైంది. టీసీఎస్ యూకే అండ్ ఐర్లాండ్ హెడ్ వినయ్ సింఘ్వీ స్పందిస్తూ.. "కెనడా లైఫ్ టెక్నాలజీ ఆధునీకరణ ప్రయాణంలో వ్యూహాత్మక భాగస్వామిగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఏఐ ఆధారిత పరివర్తనలో మా నాయకత్వానికి ఈ ఒప్పందమే నిదర్శనం" అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా టీసీఎస్ బ్రిటన్, ఐర్లాండ్, జర్మనీ దేశాల్లో తమ ఐటీ ఉద్యోగులకు అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ వాడటంలో శిక్షణ, సర్టిఫికేషన్, కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లను కూడా నిర్వహించనుంది. మొత్తానికి యూరప్ ఇన్సూరెన్స్ రంగంలో టీసీఎస్ కొట్టిన ఈ ప్రాజెక్టుతో గ్లోబల్ మార్కెట్‌లో దాని పేరు మారుమోగిపోనుందని నిపుణులు అంటున్నారు.