మళ్లీ టీడీపీతో జనసేన పొత్తు ?

మళ్లీ టీడీపీతో జనసేన పొత్తు ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఇవాళ  జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్  కళ్యాణ్ భేటీతో ఏపీ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి.  భవిష్యత్ రాజకీయ సమీకరణాలు మారొచ్చనే దిశగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.  ఇటీవల విశాఖలో చోటుచేసుకున్న ఘటనలపై పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు స్వయంగా వచ్చి కలిశారు. విజయవాడలోని ఓ హోటల్ లో దాదాపు గంటసేపు ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడే క్రమంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అవసరమైతే మళ్లీ కలుస్తాం.. ముందుకెళ్తాం.  పవన్ ను కోరుతున్నాను. అందరం కలుద్దాం. కలిసొచ్చే అన్ని పార్టీలతో చర్చిస్తాం’ అని  టీడీపీ అధినేత కామెంట్ చేశారు. వీటిని  బట్టి జనసేనతో పొత్తు కోసం టీడీపీ ఆత్రుతగా ఎదురుచూస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో భావసారూప్య రాజకీయ పక్షాలతో కలిసి వైఎస్సార్ సీపీపై  ఉమ్మడి పోరు చేయాలని టీడీపీ యోచిస్తోందని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు తర్వాత మీడియాతో పవన్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలతో సంబంధమున్న అంశం కాదిది.. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన విషయం’’ అని చెప్పారు. నిరంకుశ ఏపీ ప్రభుత్వ విధానాలపై బీజేపీ, టీడీపీ, వామపక్షాలన్నింటితోనూ కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు.

చంద్రబాబుతో భేటీకి సరిగ్గా గంట ముందు..

చంద్రబాబుతో భేటీకి సరిగ్గా గంట ముందు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘‘ ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారబోతోంది.  బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ అంటే నాకు గౌరవం. కానీ వాళ్లకు ఊడిగం చేయం’’ అని జనసేన అధినేత పవన్  తేల్చి చెప్పారు. ఈ కామెంట్స్ చేసిన కాసేపటికే చంద్రబాబుతో  భేటీ కావడం.. పవన్ రాజకీయ వ్యూహంలో మార్పునకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఒకరోజు ముందు..

చంద్రబాబుతో భేటీకి సరిగ్గా ఒకరోజు ముందు (అక్టోబరు 17న) కూడా కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం రోజున ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుతో పవన్ కళ్యాణ్ భేటీ అయి సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ భేటీ అనంతరం ‘‘ బీజేపీ వాళ్లు నేను అడిగిన రోడ్ మ్యాప్ ను సకాలంలో ఇవ్వడం లేదు. దీనివల్ల నాకు సమయం గడిచిపోతోంది. పదవులపై ఎంతమాత్రం నాకు వ్యామోహం లేనే లేదు. రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే.. గూండాలు గదమాయిస్తుంటే ప్రజలను కాపాడుకోవడానికి నేను వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోంది’’ అని జనసేనాని పవన్ వ్యాఖ్యానించారు. అమరావతి వంటి విషయాల్లో ఏపీ బీజేపీ పోరాటానికీ, బీజేపీ జాతీయ నాయకత్వం వ్యవహరించే తీరుకు చాలా తేడా ఉంటోందని మొదటి నుంచీ పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు. జనసేన పార్టీ శ్రేణుల్లోనూ ఇదే విధమైన అభిప్రాయం గూడుకట్టుకుంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కారుపై పోరాటానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ తో జనసేన, బీజేపీ ముందుకు సాగాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు.  కానీ, ఇది సాధ్యమయ్యే అవకాశం లేదనే అభిప్రాయానికి రావడం వల్లే.. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజుతో భేటీ జరిగిన మరుసటి రోజే చంద్రబాబుతో పవన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.

పవన్ పక్కన ఉండగానే..

పవన్ పక్కన ఉండగానే.. కలిసి నడిచే అవకాశాల గురించి చంద్రబాబు వ్యాఖ్యలు చేయగలిగారంటే, ఆ ఇద్దరి సుదీర్ఘ భేటీలోనూ పొత్తుల అంశంపై చర్చ జరిగి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ‘‘వైసీపీ ముక్త ఏపీ కోసం పనిచేస్త..  ఓట్లు చీలకుండా చేస్త’’ అని గతంలో పవన్ పలుమార్లు చెప్పారు. ఓట్లు చీలనివ్వకపోవడం అంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో ముందస్తు పొత్తులేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముందస్తు పొత్తులతో ముందుకు వెళ్తే ఓట్లు చీలే అవకాశం ఉండదని జనసేనాని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

గతాన్ని పరిశీలిస్తే..

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. అత్యంత అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా ఉన్న క్రేజ్ తో అప్పట్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ముందుకొచ్చిన వైఎస్సార్ సీపీ అధినేతను ఏపీ ప్రజలు ఆశీర్వదించారు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న పవన్.. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీతో చేయి కలిపారు. బీజేపీ, జనసేన సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి. ఆ కమిటీల ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.  అయితే.. వైఎస్సార్ సీపీ సర్కారుపై బలంగా ఏపీ బీజేపీ విమర్శలు గానీ, పోరాటం గానీ చేయలేకపోతోందని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ, జనసేన రెండూ ఒక్కటేనని వైఎస్సార్ సీపీ మొదటి నుంచి వాదిస్తోంది. తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీని కూడా వైసీపీ విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.