ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం టౌన్, వెలుగు: ఈ 25న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరవుతున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తెలిపారు. సిటీలోని టీడీపీ ఆఫీసులో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సభకు లక్ష మందిని సమీకరించాలని కోరారు.

బహిరంగసభపై ప్రచారం చేయాలని, పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలో చేర్పించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. డాక్టర్  వి రామనాథం, బండి పుల్లయ్య, జాతీయ అధికార ప్రతినిధి టి జ్యోత్స్న, కాసా కృష్ణమోహన్, కేతినేని హరీశ్​ పాల్గొన్నారు.

మార్నింగ్ వాక్ తో సంపూర్ణ ఆరోగ్యం

ఖమ్మం టౌన్, వెలుగు: మార్నింగ్ వాక్​తో ఆరోగ్యంగా ఉండవచ్చని ఎంపీ నామా నాగేశ్వరావు అన్నారు. సిటీలోని పెవిలియన్  గ్రౌండ్​లో ఆదివారం పెవిలియన్ గ్రౌండ్  వాకర్స్  కమిటీ ఆధ్వర్యంలో మొక్కల సంరక్షణకు రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన పైపులైన్ ను నగర మేయర్ పూనకోలు నీరజ, కార్పొరేటర్లు బుడిగం శ్రీనివాస్, పాలెపు విజయలతో కలిసి ప్రారంభించారు.

కార్యక్రమంలో వాకర్స్ కమిటీ అధ్యక్షుడు బుడిగం శ్రీనివాస్, సభ్యులు కొండమీద వెంకట్, రాకం శ్యాంబాబు, దుర్గేశ్, శంకర్, సుదర్శన్, దామోదర్ రెడ్డి, మంగ, నీరజ, రాణి, బుర్రి ఇందిర, ముతయ్య , కోటయ్య, రోటరీ క్లబ్  సభ్యులు సాంబశివరావు, ఏకాంబరరావు తదితరులు పాల్గొన్నారు.

సీతారాముల మూలవరులకు అభిషేకం

భద్రాచలం, వెలుగు: సీతారాముల మూలవరులకు ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. గోదావరి నుంచి తీర్థబిందె తెచ్చి సుప్రభాతసేవ చేసి బాలబోగం నివేదించారు. అనంతరం ఆవు పాలు, నెయ్యి, పెరుగు, పంచదార, తేనెలతో అభిషేకం, స్నపన తిరుమంజనం చేశారు. చినజీయర్​ స్వామి సమర్పించిన బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన నిర్వహించారు.

కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం జరిపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​కు చెందిన కుప్పాల రామ్మూర్తి దంపతులు స్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1,05,116 విరాళంగా ఇచ్చారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.

ఏపీలో భద్రాద్రి రామయ్య కల్యాణం

ఏపీలోని ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పెద్ద నిండ్రకొలను గ్రామస్తులు ఆదివారం తమ గ్రామంలో భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని వైభవంగా జరిపించుకున్నారు. భద్రాచలం నుంచి రామరథం ద్వారా కల్యాణమూర్తులను తీసుకెళ్లారు. అక్కడ భద్రాచలం అర్చకులు సీతారాములకు కల్యాణం నిర్వహించగా, ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్రు సత్యనారాయణ, ఉంగటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు 
పాల్గొన్నారు.

అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు

కూసుమంచి, వెలుగు: పాలేరు డివిజన్​లోని నాలుగు మండలాల్లో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తానని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో టీయుడబ్ల్యూజే(టీజేఎఫ్) డివిజన్​ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు త్వరలో ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.

కిసాన్​మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు. అనంతరం పాలేరు డిజవిన్​ టీజేఎఫ్​ అధ్యక్షుడిగా డీకే కర్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి, టీజేఎఫ్​ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ, ఉపాధ్యక్షుడు ప్రశాంత్​రెడ్డి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మల్లిక వెంకటేశ్వర్లు, విజేత, జయచంద్రారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్​ ఇంటూరి శేఖర్, ఎంపీపీలు శ్రీను, బోడ మంగీలాల్, బెల్లం వేణు పాల్గొన్నారు. 

శాంతిభద్రతలను సీఎం పక్కన పెట్టిండు

ఖమ్మం టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్ శాంతిభద్రతలను గాలికి వదిలేశారని, రాత్రి, పగలు  తేడా లేకుండా మద్యం షాపులు తెరిచే ఉంటున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ రవీందర్ నాయక్  ఆరోపించారు. సిటీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతీ గిరిజనుడు 5 లీటర్ల సారా కాసుకునే హక్కు ఉన్నప్పటికీ గిరిజన మహిళలను వేధింపులకు గురి చేసి జైలుకు పంపించారని చెప్పారు.

కేసీఆర్  కూతురు కవిత దేశవ్యాప్తంగా సారా వ్యాపారం చేస్తే తన బిడ్డను వెనకేసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గిరిజనులకు వెంటనే పోడు పట్టాలు ఇవ్వాలని, ఫారెస్ట్  ఆఫీసర్లకు రక్షణ కల్పించాలని కోరారు. గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా మోర్చా జిల్లా ఇన్​చార్జి విజయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాం రాథోడ్, రుద్ర ప్రదీప్, నున్నా రవికుమార్, రవి రాథోడ్, భుక్యా శ్రీను నాయక్, పి విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

వచ్చేది కాంగ్రెస్​ సర్కారే

కామేపల్లి, వెలుగు: టీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని పాత లింగాల గ్రామంలో ఇల్లందు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతీ కార్యకర్త  బూత్  స్థాయి నుంచి పార్టీ పటిష్టత కోసం పని చేయాలని సూచించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్  విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి పదవులు పొందిన దామోదర్ రెడ్డి, గోపాల్ రెడ్డిలను శాలువాలు కప్పి పూలమాలతో సన్మానించారు.

ముచ్చర్ల గ్రామానికి చెందిన వార్డు మెంబర్ కోలా వెంకటేశ్వర్లు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. గింజల నరసింహారెడ్డి, చింతలపూడి శేఖర్, గుండా నరసింహారావు, పులి సైదులు, రెడబోతు గోపిరెడ్డి, దమ్మాలపాటి సత్యనారాయణ పాల్గొన్నారు.

సీపీఐ ధర్నాలను సక్సెస్​ చేయాలి

ఖమ్మం రూరల్, వెలుగు: కలెక్టరేట్​తో పాటు రెవెన్యూ కార్యాలయాల ఎదుట ఈ నెల 14న చేపట్టనున్న ధర్నాలను సక్సెస్​ చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్​ కోరారు. ఆదివారం మండలంలోని సీపీఐ ఆఫీసులో మండల కౌన్సిల్  సమావేశాన్ని సీపీఐ జిల్లా కౌన్సిల్  సభ్యుడు పగిళ్ల వీరభద్రం అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్​ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల్  కమిషన్  చైర్మన్ మహమ్మద్ మౌలానా, జిల్లా కార్యవర్గ సభ్యులు మెడకంటిం చిన్నవెంకట్ రెడ్డి, అజ్మీరా రామ్మూర్తి నాయక్, యడ్లపల్లి శంకరయ్య, బానోతు రాంకోటి, పుచ్చకాయల సుధాకర్  పాల్గొన్నారు. 

అనాథలను  ఆగం చేయొద్దు

అశ్వారావుపేట, వెలుగు: వివిధ కారణాలతో అనాథాశ్రమంలో చేరుతున్న వృద్ధులకు ఆసరాగా ఉండాలని అమ్మ సేవా సదన్ నిర్వాహకురాలు కొరపాటి అనసూయ కోరారు. ఆదివారం వృద్ధాశ్రమంలో మీడియాతో మాట్లాడుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఆశ్రమాన్ని నడిపిస్తున్న తనపై కొందరు నిందలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 28 మంది వృద్ధులతో ఆశ్రమాన్ని నడుపుతున్నానని చెప్పారు.

సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారికి కొందరు ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని కంటతడి పెట్టారు. పరిస్థితి ఇలాగే ఉంటే భద్రాచలం వృద్ధాశ్రమానికి ఇక్కడి వారిని తరలించడం చేయగలిగిందేమి లేదన్నారు. అధికారులు ఆశ్రమాన్ని కాపాడాలని కోరారు.

ఘనంగా సెమీ క్రిస్మస్​ వేడుకలు

వైరా,వెలుగు: మండలంలోని పాలడుగు గ్రామంలోని చర్చిలో ఆదివారం పాస్టర్ మోదుగు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్​టీపీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ బాబు, మండల అధ్యక్షుడు పీవీఎం ప్రసాద్  హాజరై కేక్ కట్​ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 150 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

అనంతరం పార్టీ అధినేత షర్మిల ఆరోగ్యం బాగుండాలని, పాదయాత్రకు అనుమతి రావాలని, జైలులో ఉన్న కార్యకర్తలు విడుదల కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ ఆదూరి ఆనంద్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాంబాబు నాయక్, జిల్లా నాయకులు వీరు నాయక్, మండల ప్రచార కార్యదర్శి ఎస్కే పాషా, సైదులు, ప్రవీణ్  పాల్గొన్నారు.

కిమ్స్  ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మణుగూరు, వెలుగు: భద్రాచలం కిమ్స్ హాస్పిటల్  సహకారంతో పీఎస్ఆర్  చారిటబుల్  ట్రస్ట్  ఆధ్వర్యంలో పట్టణంలోని జడ్పీ హైస్కూల్ లో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కార్డియాలజీ, న్యూరో, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, డెర్మటాలజీ విభాగాల వైద్యులు పాల్గొని 570 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు.

పీఎస్ఆర్  చారిటబుల్  ట్రస్ట్  ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హాస్పిటల్ జనరల్ మేనేజర్లు బాబురెడ్డి, రవిరెడ్డి, మార్కెటింగ్  మేనేజర్  వెంకటేశ్వరరావు, రవి, అనిల్ పాల్గొన్నారు. 

ఎమ్మెల్యేను సన్మానించిన ఎంపీ నామా

వైరా, వెలుగు: నాలుగేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ను ఎంపీ నామా నాగేశ్వరరావు సన్మానించారు. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో ఆదివారం సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

అనంతరం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావును పరామర్శించారు. ఆయన సతీమణి రాజేశ్వరమ్మ ఇటీవల చనిపోయారు. ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బొర్రా రాజశేఖర్, సూతగాని జైపాల్, రత్నం, కనకదుర్గ, పావని, బాణాల వెంకటేశ్వరరావు, దార్నా రాజశేఖర్, పోట్ల శ్రీను, మచ్చ వెంకటేశ్వర్లు, సర్పంచ్​ రామారావు తదితరులుపాల్గొన్నారు.  

ధాన్యం కొనుగోళ్లు ముందు పడట్లే
ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న ఖమ్మం జిల్లా రైతులు 
ఇప్పటి వరకు సేకరించింది 40 వేల టన్నులే
చలి, మంచు కారణంగా తగ్గని తేమ శాతం
రేటు తక్కువైనా పచ్చి వడ్లనే అమ్ముకుంటున్రు

ఖమ్మం, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల కంటే ప్రైవేట్​ వ్యాపారులకు వడ్లు అమ్ముకునేందుకే రైతులు మొగ్గు చూపిస్తున్నారు. క్వింటాకు రూ.300 నుంచి రూ.400 వరకు ధర తక్కువైనా, ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకుంటున్నారు. ఒకవైపు చలి ఎఫెక్ట్ చూపిస్తుండడం, రెండు మూడ్రోజుల నుంచి వాతావరణంలో మార్పు రావడంతో ధాన్యం ఎక్కడ తడుస్తుందోనన్న టెన్షన్​ తో రైతులు వీలైనంత త్వరగా పంటను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం 17 లోపు ఉండాలన్న నిబంధన ఉండడంతో వడ్లను ఎండబెట్టలేక రేటు తక్కువకే అమ్మి నష్టపోతున్నారు. 

సెంటర్లు ఏర్పాటు చేసినా..

జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సీజన్​ లో 223 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.80 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అన్ని కేంద్రాలను ప్రారంభించినా, 5892 మంది రైతుల నుంచి 40,601 మెట్రిక్​ టన్నులను మాత్రమే కొన్నారు. ఇందులో కామన్​ రకం 25,977 టన్నులు ఉండగా, 14,623 టన్నుల గ్రేడ్–ఏ రకం ధాన్యం కొన్నారు.

ఇక కొనుగోలు చేసిన వడ్లకు సంబంధించి ఇప్పటి వరకు 692 మంది రైతులకు మాత్రమే రూ.8.45 కోట్లను బ్యాంకు అకౌంట్లలో జమ చేశారు. ఇంకా 5,200 మంది రైతులకు రూ.26.96 కోట్లు చెల్లించాల్సి ఉంది. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి ప్రభుత్వం రూ.2060 ధర చెల్లిస్తుండగా, కామన్​ రకం ధాన్యానికి రూ.2040 చొప్పున కొనుగోలు చేస్తోంది. అయితే ప్రైవేట్ వ్యాపారులు కొన్ని మండలాల్లో క్వింటా రూ.1650 నుంచి రూ.1850కి కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం ఎండబోయాల్సిన అవసరం లేకుండా, తుఫాను గురించి టెన్షన్​ లేకుండా పచ్చి వడ్లనే వ్యాపారులు కొంటుండడంతో రైతులు దాని వైపే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. 

చిరు జల్లులతో రైతుల్లో ఆందోళన

గుండాల, వెలుగు : తుఫాన్​ కారణంగా మబ్బులు కమ్ముకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్లు, మొక్కజొన్న కోసి చేలల్లో ఆరబోశారు. మూడు రోజులుగా చిరు జల్లులు కురుస్తుండడంతో రైతులు తమ పంటను కాపాడుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పత్తి తడవడంతో ఏరలేక పోతున్నామని వాపోతున్నారు. తడిసిన పంట దిగుబడులను మార్కెట్​కు తీసుకెళ్తే ధర పలకడం లేదని రైతులు అంటున్నారు. 
తక్కువ ధరకే అమ్ముకుంటున్నం
తుఫాను వల్ల తక్కువ ధరకే ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లకు తీసుకెళ్లాలంటే వడ్లను కనీసం 5 రోజులు ఆరబెట్టాలి. లేదంటే తేమ శాతం ఎక్కువ ఉందంటూ ధర తగ్గించి కాంటాలో 5 కేజీల తరుగు తీస్తున్నారు. ఈ ఇబ్బందులు పడలేకనే రూ.400 తేడా ఉన్నా ప్రైవేట్  వ్యాపారులకు పచ్చి వడ్లనే అమ్మేస్తున్నాం.  - బోలె సాంబయ్య, పెనుబల్లి