తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో .. తెలుగు తమ్ముళ్లది తలోదారి!

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ..  తెలుగు తమ్ముళ్లది తలోదారి!
  •     పలు పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్లలో ఇంకా బలంగానే టీడీపీ 
  •     ఆ పార్టీ నేతలను పట్టించుకోని బీజేపీ  
  •     ఏపీలో అధికారం కోసం అన్నీ వదలుకుని పొత్తులు 
  •     తెలంగాణలో పోటీ చేయక పట్టుకోల్పోతున్న పార్టీ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలుగు తమ్ముళ్లు తలో దారి చూసుకుంటున్నారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న నేతలు, కార్యకర్తలంతా ఆయా నియోజకవర్గాల్లో తమకు అనుకూలమైన పార్టీలవైపు మొగ్గుచూపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీ చేయకుండా తటస్థంగా వ్యవహరించింది. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీ చేద్దామని కేడర్ కు పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా తెలంగాణ టీడీపీలో మాత్రం చలనం లేదు. ఒకవైపు అన్ని పార్టీలు టికెట్లు కేటాయించి ప్రచారం ప్రారంభించినా, టీడీపీ మాత్రం పోటీ ఆలోచనే చేయలేదు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు తమ దారి తాము చూసుకుంటున్నారు. 

సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేయని టీడీపీ 

పొత్తు లేకపోవడం, పార్టీ అధిష్టానం కూడా చెప్పకపోవడంతో బీజేపీకి టీటీడీపీ కూడా సపోర్ట్ చేయడంలేదు. తెలంగాణలో టీడీపీ ఉండొద్దనే ఆలోచన బీజేపీకి ఉందని, అలాంటి పార్టీకి తామెందుకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తామని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇప్పుడు పార్టీ చీఫ్ చంద్రబాబు ఒత్తిడి తెచ్చినా సపోర్ట్ చేయబోమని టీటీడీపీ నేతలు అంటున్నారు. ‘‘ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి అక్కడ పార్టీ ఎక్కువే సీట్లు ఇచ్చింది. తెలంగాణలో మా పార్టీకి ఇంకా కొద్దోగొప్ప కేడర్‌‌‌‌‌‌‌‌ ఉంది. పలు జిల్లాల్లోనూ ఇప్పటికీ ప్రతీ గ్రామంలో టీడీపీ కేడర్‌‌‌‌‌‌‌‌ పనిచేస్తున్నది. ప్రతి మండలంలో పార్టీలు ఆఫీసులు కొనసాగుతున్నాయి. అయినా కనీసం గుర్తింపు ఇవ్వని పార్టీకి మేమెలా సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తాం?” అని పచ్చపార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పట్టులేని జనసేనతో పొత్తు పెట్టుకున్నారని.. బలంగా ఉన్న తమను పక్కన పెట్టారని గుర్తు చేస్తున్నారు. 

పలు సెగ్మెంట్లలో ఇంకా పట్టు 

రాష్ట్రంలోని పలు జిల్లాలు, పలు పార్లమెంట్‌‌‌‌‌‌‌‌స్థానాల్లో టీడీపీకి ఇంకా కేడర్‌‌‌‌‌‌‌‌ ఉంది.  ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో పార్టీకి ఇప్పటికీ కొంత పట్టుంది. ప్రధానంగా రాష్ట్రంలోని17 పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ సీట్లలో మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్లలో ఆ పార్టీకి ఎంతో కొంత క్యాడర్ ఉంది. ఖమ్మం, మల్కాజిగిరి సెగ్మెంట్లలో గెలుపోటములను డిసైడ్‌‌‌‌‌‌‌‌ చేసే స్థాయిలో ఓటు బ్యాంక్ ఉన్నది. భువనగిరి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్ పరిధిలో మునుగోడు, ఇబ్రహీంపట్నం.. నల్గొండ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ పరిధిలో కోదాడ, ఖమ్మం పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఖమ్మం, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ పరిధిలో భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టుంది. కానీ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల నుంచీ పోటీలో లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ క్రమంగా పట్టు కోల్పోతున్నది. ఈ ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.

పట్టించుకోని బీజేపీ 

ఏపీలో లోక్ సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. అక్కడ జనసేనతోపాటు బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ ఒక కూటమిగా రంగంలోకి దిగింది. తెలంగాణలో మాత్రం బీజేపీతో పొత్తు విషయం ఎటూ తేలలేదు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నప్పటీకీ తెలంగాణలో ఆ పార్టీ నేతలతో బీజేపీ నేతలు అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదు. మరోవైపు తెలంగాణలో టీడీపీతో పొత్తు లేదని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో తెలుగుదేశం కేడర్‌‌‌‌‌‌‌‌ లో నైరాశ్యం నెలకొంది. ఇప్పటివరకు పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు, కార్యకర్తలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్‌‌‌‌‌‌‌‌ అంతా దాదాపుగా అధికార పార్టీలోకే చేరుతున్నారు.