ఇంటర్ ఎగ్జామ్ సెంటర్లలో టీ, కాఫీలూ బంద్

ఇంటర్  ఎగ్జామ్ సెంటర్లలో టీ, కాఫీలూ బంద్
  •     సెల్ఫ్ సెంటర్లపై ఇంటర్ బోర్డు స్పెషల్ ఫోకస్
  •     ఎగ్జామ్ సెంటర్లలోకి సీఎస్, డీవోల ఫోన్లు నాట్ అలవ్
  •     పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్​  జరగకుండా సర్కార్ చర్యలు
  •     ఇప్పటికే కామారెడ్డిలో నలుగురిపై వేటు 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్​పై సర్కారు ఫోకస్ పెట్టింది. లీకేజీలు, మాస్ కాపీయింగ్ కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఓ సెంటర్​లో మాస్ కాపీయింగ్ కు ప్రయత్నించిన లెక్చరర్లపై వేటు వేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెల్ఫ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించింది. పరీక్షా కేంద్రంలోకి బయటి వ్యక్తులు వచ్చే అన్ని మార్గాలనూ కట్టడి చేసేందుకు గానూ, పరీక్షా సమయంలో సెంటర్లలో టీ, కాఫీలనూ నిషేధించారు. ఫిబ్రవరి 28న మొదలైన ఇంటర్ ఎగ్జామ్స్ ఈ నెల19 వరకూ కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు సుమారు 9.80 లక్షల మంది అటెండ్ కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎగ్జామ్స్ కావడంతో అందరి దృష్టి ఈ పరీక్షలపై పడింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో పలు మార్లు సమీక్షలు నిర్వహించారు. 

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 29న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మాస్ కాపీయింగ్ కు లెక్చరర్లు ప్రయత్నించారు. దీంతో లెక్చరర్లు ఇష్రత్, రంజిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరితో పాటు పరీక్షా కేంద్రం సీఎస్ ప్రతాప్ లింగం, డీవో రాజాగౌడ్​లను ఇంటర్మీడియేట్ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఒక్క ఘటనతో రాష్ట్ర యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. సీఎస్ శాంతికుమారి, డీజీపీ, విద్యాశాఖ అధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి, పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అవకతవకలకు పాల్పడే వారు ఎంతపెద్ద స్థాయిలో ఉన్న కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోపక్క మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఓ లెక్చరర్ మాస్ కాపీయింగ్ కు పాల్పడినట్టు ఇంటర్ బోర్డు దృష్టికి రావడంతో దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు.

సెల్ఫ్ సెంటర్లపై నిఘా

రాష్ట్రంలో సుమారు 15 నుంచి20 వరకూ సెల్ఫ్ సెంటర్లుంటాయి. ఇవన్నీ మారుమూల ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. అయితే, కామారెడ్డి జిల్లాలో సెల్ఫ్ సెంటర్​లో మాస్ కాపీయింగ్ కు ప్రయత్నం జరగడంతో అన్ని సెంటర్లపై నిఘా పెంచారు. సిట్టింగ్ స్క్వాడ్‌‌‌‌ టీమ్​లు నియమించారు. దీంతో పాటు ఆయా సెంటర్లను తప్పనిసరిగా ప్లైయింగ్ స్క్వాడ్ టీము లేదా, ఇతర బృందాలు తనిఖీ చేయాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. దీనికి తోడు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లు కూడా ఫోన్లు వాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. సమస్యాత్మక సెంటర్లను గుర్తించి, వాటిపైనా నిఘా పెంచారు. ఏది ఏమైనా ఈ సారి పరీక్షలను ప్రభుత్వం చాలెంజ్ గా తీసుకోవడంపై లెక్చరర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సెకండియర్ ఇంగ్లిష్  పరీక్షలో ముగ్గురిపై మాల్ ప్రాక్టీస్ కేసులు

ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షలో ముగ్గురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. శనివారం జరిగిన పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా 4,49,868 మంది అటెండ్ కావాల్సి ఉండగా, 4,35,387 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 14,481 మంది హాజరుకాలేదు. కాగా, జనగామలో ఇద్దరు, ఖమ్మంలో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.