పోక్సో కేసు నమోదైందని టీచర్ సూసైడ్.. ఖమ్మం జిల్లా అమ్మపాలెం గురుకుల ఉపాధ్యాయుడు

పోక్సో కేసు నమోదైందని టీచర్ సూసైడ్.. ఖమ్మం జిల్లా అమ్మపాలెం గురుకుల ఉపాధ్యాయుడు

వైరా, వెలుగు: పోక్సో కేసు నమోదు కావడంతో ఖమ్మం జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిపై బయాలజీ టీచర్  అరిగెల ప్రభాకర్ రావు లైంగిక దాడికి పాల్పడుతున్నాడని కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో సోమవారం కేసు నమోదైంది. 

ఎస్సై సూరజ్  తెలిపిన సమాచారం ప్రకారం.. మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి దసరా సెలవులకు ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి స్కూల్ కు వెళ్లేందుకు నిరాకరిస్తుండడంతో, ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో కాంట్రాక్ట్  బేసిస్ పై బయాలజీ టీచర్ గా పని చేస్తున్న ప్రభాకర్ రావు లైంగిక వేధింపుల విషయం బయటపడింది. 

దీంతో తల్లిదండ్రులు కొణిజర్ల పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. విషయం పోలీసుల వరకు వెళ్లడం, పోక్సో కేసు నమోదు కావడంతో అవమాన భారంతో టీచర్  ప్రభాకర్ రావు పురుగుల మందు తాగాడు.  కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్  ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం చనిపోయాడు. ప్రభాకర్ రావు(45) సొంతూరు మధిర మండలం ఆత్మకూరు కాగా, మైనార్టీ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్  బేసిస్  టీచర్​గా ఏడేండ్లుగా పని చేస్తున్నాడు. ప్రభాకర్ రావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.