- 367 మంది టీచర్లు అదనంగా ఉన్నట్టు గుర్తించిన అధికారులు
- వచ్చే అకడమిక్ ఇయర్‌లోగా రేషనలైజేషన్ పూర్తికి కసరత్తు
మంచిర్యాల, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ల కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రేషనలైజేషన్ చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది. 2025–-26 యూడైస్ఆధారంగా స్టూడెంట్లలెక్కలు తీసి వచ్చే అకాడమిక్ఇయర్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయడానికి విద్యాశాఖ అధికారులు కసర్తతు చేస్తున్నారు. ఏ స్కూల్లో ఎంత మంది స్టూడెంట్స్ఉన్నారు, ఎంత మంది టీచర్లు అవసరమనే వివరాలను క్రోడీకరిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 15 ఏండ్ల తర్వాత రేషనలైజేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం విశేషం. దీంతో వచ్చే విద్యాసంవత్సరం స్కూళ్లలో టీచర్ల కొరత తీరుతుందని భావిస్తున్నారు.
అదనంగా 367 మంది టీచర్లు
మంచిర్యాల జిల్లాలో ప్రైమరీ స్కూళ్లు 488, అప్పర్‌ప్రైమరీ స్కూళ్లు 88, హైస్కూళ్లు 101తో కలిపి మొత్తం 684 గవర్నమెంట్ స్కూళ్లు ఉన్నాయి. 2025–26 యూడైస్ లెక్కల ప్రకారం వాటిలో 30,406 మంది స్టూడెంట్స్చదువుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 2,474 మంది టీచర్లు ఆయా స్కూళ్లలో పనిచేస్తున్నారు. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా విద్యాశాఖ అధికారులు ఆయా స్కూళ్లలో ఉన్న స్టూడెంట్లు, అక్కడ పనిచేస్తున్న టీచర్ల వివరాలు తీశారు. రేషనలైజేషన్గైడ్లైన్స్ ప్రకారం జిల్లాలో 367 టీచర్లు అదనంగా ఉన్నట్టు గుర్తించారు. చెన్నూర్ మండలంలో 43, నెన్నెలలో 29, జైపూర్‌లో 26, మంచిర్యాలలో 26, దండేపల్లిలో 43, కోటపల్లిలో 25, తాండూర్‌లో 24, హాజీపూర్‌లో 22 మంది టీచర్లు అదనంగా ఉండగా.. మిగతా మండలాల్లో 20 మంది లోపు సర్ప్లస్
ఉన్నట్టు తేల్చారు.
పీఎస్, యూపీఎస్‌లలో..
బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 ఆగస్టు 12న రేషనలైజేషన్ జీవో ఎంఎస్ నంబర్25ను జారీ చేసింది. దాని ప్రకారం స్టూడెంట్ల సంఖ్యను బట్టి టీచర్లను నియమించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కౌన్సెలింగ్ద్వారా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేయనున్నారు. పీఎస్, యూపీఎస్‌లలో ఒకటి నుంచి 19 మంది స్టూడెంట్స్కు ఒక టీచర్, 20–60 మందికి ఇద్దరు, 61–90 వరకు ముగ్గురు, 91–120 వరకు నలుగురు, 121–150 వరకు ఐదుగురు, 151–200 వరకు హెచ్ఎంతో పాటు ఐదుగురు ఎస్జీటీలు ఉంటారు. 201 నుంచి ప్రతి 40 మంది స్టూడెంట్స్కు ఒక టీచర్‌ను నియమించాలి. యూపీఎస్‌లలో 6, 7 క్లాస్‌లకు ఇద్దరు లాంగ్వేజ్, మరో ఇద్దరు నాన్ లాంగ్వేజ్టీచర్లు ఉండాలి.
హైస్కూళ్లలో ఇలా..
220 మంది వరకు హెచ్ఎంతో పాటు 8 మంది టీచర్లు, 221–250 వరకు అదనంగా మ్యాథ్స్ టీచర్, 251–290 వరకు అడిషనల్‌గా మ్యాథ్స్, ఇంగ్లిష్, తెలుగు టీచర్లను కేటాయించాలి. 311–340 వరకు ఫిజికల్ సైన్స్, 371–400 వరకు బయోసైన్స్ టీచర్లను అదనంగా నియమించాలి. 401–430 మంది విద్యార్థులుంటే అదనంగా మరో మ్యాథ్స్ టీచర్‌ను కేటాయించాలి. ఆ తర్వాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున సంఖ్య పెరుగుతుంది.
తీరనున్న టీచర్ల కొరత
ప్రస్తుతం జిల్లాలోని పలు గవర్నమెంట్ స్కూళ్లలో స్టూడెంట్, టీచర్ రేషియా ప్రకారం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు ఒక స్కూల్లో 20 మంది స్టూడెంట్స్కు ముగ్గురు టీచర్లు ఉంటే.. మరో స్కూల్లో 100 మందికి ఇద్దరే ఉన్నారు. దీంతో వర్క్‌అడ్జస్ట్‌మెంట్ పేరిట టీచర్లను ఒక స్కూల్నుంచి మరో స్కూల్‌కు పంపి టెంపరరీగా సర్దుబాటు చేస్తున్నారు. రేషనలైజేషన్ చేపడితే స్టూడెంట్ల సంఖ్యకు సరిపడా టీచర్లను నియమించే అవకాశం ఉంటుంది. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగనుండడంతో టీచర్ల కొరత పరిష్కారవుతుందని పేర్కొంటున్నారు. రేషనలైజేషన్ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, మెంబర్స్‌గా అడిషనల్కలెక్టర్, జడ్పీ సీఈవో, ఐటీడీఏ పీవో, మెంబర్ సెక్రటరీగా డీఈవో వ్యవహరిస్తారు.
టీచర్ల కొరత తీరుతుంది
రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్స్కూళ్లలో టీచర్ల కొరత నెలకొంది. విద్యార్థులు తక్కువ ఉన్న చోట టీచర్లు ఎక్కువగా.. విద్యార్థులు ఎక్కువగా ఉంటే టీచర్లు తక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో విద్యాబోధనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు చేస్తున్నారు. రేషనలైజేషన్ ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుంది. - గంగాధర్, పీఆర్టీయూ టీజీ, జనరల్ సెక్రటరీ, మంచిర్యాల జిల్లా
