- హోం వర్క్ చేయలేదని స్టూడెంట్లపై టీచర్ల కాఠిన్యం
- మేడ్చల్ జిల్లా సెయింట్ మేరీస్ పాఠశాలలో ఘటన
మేడ్చల్, వెలుగు: దసరా పండుగ సెలవుల్లో ఇచ్చిన హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై కాఠిన్యంగా ప్రవర్తించారు ఆ టీచర్లు. విద్యార్థులను అంగీలు విప్పించి మోకాళ్లపై కూర్చోబెట్టి హోంవర్క్ చేయించారు. మేడ్చల్ మండల పరిధిలోని పూడూరులో ఉన్న సెయింట్ మేరీస్ పాఠశాలలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. బడిలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ఈ అనుభవం ఎదురైంది.
దసరా పండుగ సెలవుల్లో ఇచ్చిన హోంవర్క్ పూర్తిచేయకపోవడంతో పాఠశాల ప్రిన్సిపల్ తమకు ఈ పనిష్మెంట్ ఇచ్చారని విద్యార్థులు మీడియాకు చెప్పారు. ఘటనను కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల సెల్ ఫోన్లను యాజమాన్యం లాక్కునే ప్రయత్నం చేసింది. స్కూల్ యాజమాన్యం వివరణ కోరగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే అలా హోంవర్క్ చేయించామని, వాళ్లను ఇబ్బందిపెట్టే ఉద్దేశం లేదని ప్రిన్సిపాల్ తెలిపారు. కాగా.. విద్యార్థులను శిక్షించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అతిక్రమించిన యాజమాన్యంపై విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.