సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
  • మంచిర్యాల జిల్లాలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం  

 వెలుగు, నెట్ వర్క్: ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు.  ఆసిఫాబాద్ లో 55 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు డీఈవో పార్శి అశోక్ అవార్డులు అందజేశారు.  సమాజంలో గురువుల స్థానం అత్యంత ఉన్నతమైనదని నిర్మల్  జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.  విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు.

 ఖానాపూర్ శాసనసభ్యుడు  వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.  రాష్ట్రంలో రెండేళ్లుగా నిర్మల్  జిల్లా పదో తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు.  ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. జిల్లా వ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 155 మంది ఉపాధ్యాయులను సన్మానించి, ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు.  కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి పరశురామ్, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.  

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని దేశం అభివృధ్ధి పథంలో నడవాలంటే  ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనదని ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా ,ఖానాపూర్​ ఎమ్మేల్యే వెడ్మా బొజ్జు పటేల్  అన్నారు. పీఏమ్మార్సీ  భవనంలో టీచర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా  సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థుల భవిష్యత్​ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదన్నారు.

 ఐటీడీఏ ఏవో వసంత్​రావ్,  వివిధ విభాగాల అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  తలమడుగు మండలం భరంపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్​కు చెందిన సామాజిక సేవకుడు మౌనిశ్​రెడ్డి రూ.70 వేల విలువ చేసే క్రీడా సామగ్రిని అందజేశారు.  కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.