ఇండియా హార్ట్‌‌ బ్రేక్.. ఉప్పల్‌‌‌‌ టెస్టులో 28 రన్స్‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్పై ఓటమి

ఇండియా హార్ట్‌‌ బ్రేక్.. ఉప్పల్‌‌‌‌ టెస్టులో 28 రన్స్‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్పై ఓటమి

ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. అచ్చొచ్చిన ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో ఏకంగా 190 రన్స్ భారీ ఆధిక్యం దక్కించుకొని విజయం పక్కా అనుకున్న టీమిండియాకు ఇంగ్లండ్ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇంగ్లిష్ టీమ్‌‌‌‌ బజ్‌‌‌‌బాల్‌‌‌‌ను తమ స్పిన్‌‌‌‌ బాల్‌‌‌‌తో దెబ్బకొడ్తామని అనుకున్న రోహిత్‌‌‌‌సేన ప్రత్యర్థి స్పిన్‌‌‌‌ వలలోనే చిక్కుకుంది. 231 రన్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ను కూడా ఛేజ్‌‌‌‌ చేయలేక చేతులెత్తేసింది. భారీ సెంచరీతో ఒలీ పోప్‌‌‌‌ (278 బాల్స్‌‌‌‌లో 21 ఫోర్లతో 196) ఇంగ్లండ్ విజయానికి బాటలు వేస్తే.. అరంగేట్రం స్పిన్నర్ టామ్‌‌‌‌ హార్ట్‌‌‌‌లీ (7/62)  రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో ఏడు వికెట్లతో ఇండియా హార్ట్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ చేశాడు. 

హైదరాబాద్, వెలుగు: టెస్టుల్లో అపజయం లేని ఉప్పల్ స్టేడియంలో టీమిండియాకు షాక్‌‌‌‌ తగిలింది. ఆధిపత్యం చేతులు మారుతూ.. అనూహ్య మలుపులు తిరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 రన్స్‌‌‌‌తో సంచలన విజయం సాధించింది. ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఇచ్చిన 231 రన్స్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో  నాలుగో రోజు, ఆదివారం ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 202 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. తొలుత రోహిత్ శర్మ (39), చివర్లో కేఎస్‌‌‌‌ భరత్ (28), అశ్విన్ (28) పోరాడగా మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు.

అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరు 316/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 420 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ఒలీ పోప్‌‌‌‌ 4 రన్స్‌‌‌‌ తేడాలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. పోప్‌‌‌‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌లో ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌‌‌‌లో జరుగుతుంది.

పోప్‌‌‌‌ అదే పోరాటం

మూడో రోజు ఇంగ్లండ్‌‌‌‌ను కష్టాల్లోంచి గట్టెక్కించిన ఒలీ పోప్‌‌‌‌ నాలుగో రోజూ ఇండియా ముందు మంచి టార్గెట్‌‌‌‌ను ఉంచాడు. 6వ ఓవర్లోనే రెహాన్ అహ్మద్‌‌‌‌ (28)ను ఔట్‌‌‌‌ చేసిన బుమ్రా ఇండియాకు బ్రేక్‌‌‌‌ ఇచ్చాడు. దాంతో ఏడో వికెట్‌‌‌‌కు 64 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. అయితే, గొప్పగా ఆడుతున్న పోప్‌‌‌‌కు టామ్‌‌‌‌ హార్ట్‌‌‌‌లీ (34) తోడయ్యాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్‌‌‌‌ చేసిన ఈ జోడీ ఇంగ్లండ్ స్కోరును 400 దాటించింది. అయితే, అశ్విన్‌‌‌‌ ఫ్లాట్, ఫుల్‌‌‌‌ లెంగ్త్ బాల్‌‌‌‌తో హార్ట్‌‌‌‌లీని బౌల్డ్‌‌‌‌ చేసి 8వ వికెట్‌‌‌‌కు 80 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ చేశాడు. ఆ వెంటనే  జడేజా బౌలింగ్‌‌‌‌లో మార్క్‌‌‌‌ వుడ్ (0) ఔట్​కాగా.. తర్వాతి బాల్‌‌‌‌కే బుమ్రా బౌలింగ్‌‌‌‌లో రివర్స్‌‌‌‌ స్వీప్‌‌‌‌కు ట్రై చేసి బౌల్డ్‌‌‌‌ అయిన పోప్ డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు.

చేజేతులా..

లంచ్ బ్రేక్ తర్వాత ఛేజింగ్‌‌‌‌కు వచ్చిన  ఇండియాకు మంచి ఆరంభమే లభించినా తర్వాత తడబడింది. తొలుత కెప్టెన్ రోహిత్, యశస్వి జైస్వాల్ (15) తొలి వికెట్‌‌‌‌కు 42 రన్స్‌‌‌‌ జోడించారు. కానీ, 12వ ఓవర్లో మూడు బాల్స్‌‌‌‌ తేడాలో జైస్వాల్‌‌‌‌తో పాటు గిల్‌‌‌‌ (0)ను పెవిలియన్‌‌‌‌ చేర్చిన హార్ట్‌‌‌‌లీ ఇండియాకు డబుల్ షాకిచ్చాడు. రాహుల్ (22) బౌండ్రీతో ఖాతా తెవరగా వెంటవెంటనే మూడు ఫోర్లు కొట్టిన రోహిత్ జోరు మీద కనిపించాడు. అదే క్రమంలో మరో షాట్​కు ట్రై చేసి హార్ట్‌‌‌‌లీకి వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఈ దశలో అక్షర్‌‌‌‌‌‌‌‌ (17)తో కలిసి రాహుల్ 95/3తో టీమ్‌‌‌‌ను టీ బ్రేక్‌‌‌‌కు తీసుకెళ్లాడు. కానీ, మూడో సెషన్‌‌‌‌ మొదలైన వెంటనే రాహుల్‌‌‌‌ను రూట్ ఎల్బీ చేయగా.. కొద్దిసేపటికే కష్టమైన రన్‌‌‌‌ కోసం ప్రయత్నించిన జడేజా (13).. స్టోక్స్‌‌‌‌ కొట్టిన సూపర్ త్రోకు రనౌటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (13) సైతం నిరాశ పరచడంతో ఇండియా 119/7తో ఎదురీత మొదలు పెట్టింది. ఈ టైమ్‌‌‌‌లో భరత్, అశ్విన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పోటాపోటీగా బౌండ్రీలు కొడుతూ ఇంగ్లండ్ బౌలర్లను డిఫెన్స్‌‌‌‌లోకి నెట్టి  ఇండియాలో ఆశలు రేపారు.

కానీ, మరో రెండు ఓవర్ల ఆట మిగిలుండగా హార్ట్‌‌‌‌లీ మిడిల్‌‌‌‌ స్టంప్‌‌‌‌పై వేసిన టర్నింగ్‌‌‌‌ బాల్‌‌‌‌ను ఫార్వర్డ్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌ ఆడేందుకు ట్రై చేసి క్లీన్ బౌల్డ్‌‌‌‌ అవ్వడంతో ఎనిమిదో వికెట్‌‌‌‌కు 57 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ అయింది.  హార్ట్‌‌‌‌లీ తర్వాతి ఓవర్లోనే క్రీజు దాటొచ్చి షాట్‌‌‌‌కు ట్రై చేసిన అశ్విన్ స్టంపౌటయ్యాడు. మరో వికెట్‌‌‌‌ మాత్రమే ఉండటంతో అంపైర్లు ఆటను 30 నిమిషాలు పొడిగించారు. కాసేపు క్రీజులో నిలిచిన సిరాజ్‌‌‌‌ (12)ని స్టంపౌంట్‌‌‌‌ చేసిన హార్ట్‌‌‌‌లీ ఇంగ్లండ్‌‌‌‌ను గెలిపించాడు. 

ఉప్పల్ స్టేడియంలో ఇండియాకు ఇది తొలి ఓటమి. మొత్తంగా ఆరు మ్యాచ్‌‌‌‌ల్లో నాలుగింట్లో గెలిచి మరో టెస్టును డ్రా చేసుకుంది.

తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో భారీ లీడ్‌‌‌‌ దక్కించుకున్న తర్వాత ఇండియాకు ఇది రెండో ఓటమి. 2015 గాలె టెస్టులో 192 రన్స్‌‌‌‌ లీడ్ సాధించిన తర్వాత ఓడింది.

రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో టామ్‌‌‌‌ హార్ట్‌‌‌‌లీ బౌలింగ్‌‌‌‌. 1945 తర్వాత టెస్టు అరంగేట్రంలో ఇంగ్లండ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌కు ఇదే అత్యుత్తమం.

సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 246 ఆలౌట్‌‌‌‌. ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 436 ఆలౌట్‌‌‌‌. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్:  420 ఆలౌట్ (ఒలీ పోప్‌‌‌‌ 196, బుమ్రా 4/41, అశ్విన్ 3/126). ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌ (టార్గెట్‌‌‌‌ 231): 69.2 ఓవర్లలో 202 ఆలౌట్ (రోహిత్ 39, భరత్ 28, అశ్విన్ 28, టామ్ హార్ట్‌‌‌‌లీ 7/62).