టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌ సెమీస్‌‌లోనే ఓడిన టీమిండియా

టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌ సెమీస్‌‌లోనే ఓడిన టీమిండియా
  • చెలరేగిన ఓపెనర్లు బట్లర్‌‌, హేల్స్‌‌
  • ఆదివారం పాక్‌‌తో టైటిల్‌‌ ఫైట్‌‌

అడిలైడ్‌‌:  టీమిండియాకు మళ్లీ హార్ట్‌‌బ్రేక్‌‌. ప్రఖ్యాత మెల్‌‌బోర్న్‌‌ క్రికెట్‌‌ స్టేడియంలో ఇండియా–పాకిస్తాన్‌‌ మధ్య టీ20 వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్‌‌ చూడాలని ఆశించిన వారికి నిరాశే. గురువారం జరిగిన టీ20 వరల్డ్‌‌ సెమీఫైనల్లో ఇండియా10 వికెట్ల తేడాతో  ఇంగ్లండ్‌‌ చేతిలో చిత్తయింది.  హార్దిక్‌‌ పాండ్యా (33 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63), విరాట్‌‌ కోహ్లీ (40 బ్సాలో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 50) ఫిఫ్టీలతో  మెప్పించినా... పేలవ బౌలింగ్‌‌, టీమ్‌‌ సెలెక్షన్‌‌తో పాటు అనేక తప్పిదాలతో నాకౌట్‌‌ అయింది. మరోవైపు ఓపెనర్లు అలెక్స్‌‌ హేల్స్‌‌ (47 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 86 నాటౌట్), జోస్‌‌ బట్లర్‌‌ (49 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 నాటౌట్‌‌)  భారీ షాట్లతో  టీమిండియా మైండ్‌‌ బ్లాంక్‌‌ చేసి ఫైనల్​ చేరింది.  టాస్‌‌ ఓడి తొలుత బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 168/6 స్కోరు చేసింది. ఇంగ్లండ్‌‌ బౌలర్లలో క్రిస్‌‌ జోర్డాన్‌‌ మూడు వికెట్లు పడగొట్టగా. ఆదిల్‌‌ రషీద్​, క్రిస్‌‌ వోక్స్‌‌ ఒక్కో వికెట్‌‌ తీశారు. తర్వాత హేల్స్‌‌, బట్లర్‌‌ వీరబాదుడుతో ఇంగ్లండ్‌‌ 16 ఓవర్లలో వికెట్‌‌ నష్టపోకుండా 170 స్కోరు చేసి అలవోకగా గెలిచింది. హేల్స్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది. ఆదివారం ఎంసీజీలో పాక్‌‌, ఇంగ్లండ్‌‌ మధ్య ఫైనల్‌‌ జరుగుతుంది. 

పవర్‌‌ ప్లేలో 38/1.. ఆదుకున్న కోహ్లీ, హార్దిక్‌‌

బ్యాటింగ్‌‌ పిచ్‌‌పై తొలుత ఇండియా నార్మల్‌‌ టార్గెట్‌‌కే పరిమితం అయింది. వరుసగా రెండు హాఫ్‌‌ సెంచరీలతో ఫామ్‌‌లోకి వచ్చిన ఓపెనర్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ (5) కీలక పోరులో ఫెయిలయ్యాడు. రెండో ఓవర్లో క్రిస్‌‌ వోక్స్‌‌ ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌ను అర్థం చేసుకోలేక కీపర్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన కోహ్లీ.. వోక్స్‌‌ బౌలింగ్‌‌లోనే ఎక్స్‌‌ట్రా కవర్‌‌ మీదుగా సిక్స్‌‌తో ఫామ్‌‌ చూపెట్టాడు. కానీ, తనతో పాటు  కెప్టెన్‌‌ రోహిత్‌‌ (28 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 27) డిఫెన్సివ్‌‌గా ఆడటం.. పవర్‌‌ప్లేలో 38/1 మాత్రమే రావడం ఫైనల్‌‌ స్కోరుపై  ప్రభావం చూపింది.  క్రీజులో కుదురుకున్న తర్వాత రోహిత్‌‌  స్పీడు పెంచే ప్రయత్నంలో జోర్డాన్‌‌ బౌలింగ్‌‌లో ఔటవగా.. సగం ఓవర్లకు  ఇండియా 62/2తో నిలిచింది.  ఈ టైమ్‌‌లో 11వ ఓవర్లో వరుసగా 6, 4 తో సూర్య కుమార్‌‌ (14) వేగం తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే స్పిన్నర్‌‌ ఆదిల్‌‌ రషీద్‌‌ తెలివైన బాల్‌‌తో అతడిని ఔట్‌‌ చేయడంతో టీమిండియా డీలా పడ్డది. కోహ్లీకి తోడైన హార్దిక్‌‌ తొలుత జాగ్రతగా ఆడటంతో 15 ఓవర్లకు గానీ స్కోరు వంద దాటలేదు. అయితే, స్లాగ్‌‌ ఓవర్లలో హార్దిక్‌‌ ఒక్కసారిగా గేరు మార్చాడు. కరన్‌‌ వేసిన 17వ ఓవర్లో సిక్స్‌‌ కొట్టిన తను తర్వాత జోర్డాన్‌‌ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో చెలరేగాడు. అదే ఓవర్లో ఫిఫ్టీ పూర్తి చేసుకొని కోహ్లీ ఔటైనా.. పాండ్యా పవర్‌‌ఫుల్‌‌ షాట్లతో రెచ్చిపోయాడు. కరన్‌‌ వేసిన 19వ ఓవర్లో 4, 6, 4తో 29 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తను లాస్ట్‌‌ ఓవర్లో మరో 6, 4 సిక్స్‌‌తో స్కోరు 160 దాటించాడు. తన తొలి 15 బాల్స్‌‌లో  13 రన్స్‌‌ మాత్రమే చేసిన హార్దిక్ తర్వాతి 18 బాల్స్‌‌లో ఏకంగా 40 రన్స్‌‌ రాబట్టడం గమనార్హం.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 168/6 (హార్దిక్‌‌ పాండ్యా 63, కోహ్లీ 50, జోర్డాన్‌‌ 3/43).
ఇంగ్లండ్‌‌: 16 ఓవర్లలో 170/0 (హేల్స్‌‌ 86 నాటౌట్‌‌, బట్లర్‌‌ 80 నాటౌట్‌‌, అర్ష్‌‌దీప్‌‌ 0/15).

ఇద్దరే బాదేశారు..

బ్యాటింగ్‌‌ పిచ్‌‌పై ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ ఓపెనర్లు బట్లర్‌‌,  హేల్స్‌‌ జోరు ముందు 169 టార్గెట్‌‌ చిన్నదైపోయింది. ఈ ఇద్దరూ ఏ ఒక్క బౌలర్‌‌నూ వదల్లేదు. ఫోర్లు, సిక్సర్లతో  మన బౌలింగ్‌‌ను ఊచకోత కోశారు. ఇంగ్లండ్‌‌ బౌలర్లు బాగానే బౌలింగ్‌‌ చేసిన వికెట్‌‌పై మనోళ్లు పూర్తిగా తేలిపోయారు. దాంతో, ఏ దశలోనూ రోహిత్‌‌సేన లక్ష్యాన్ని కాపాడుకునేలా కనిపించలేదు.  టీమ్‌‌లో లెగ్‌‌ స్పిన్నర్‌‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. భువనేశ్వర్‌‌ తొలి ఓవర్లోనే బట్లర్‌‌ మూడు ఫోర్లతో తన ఉద్దేశం ఏంటో చెప్పగా.. అలెక్స్‌‌ హేల్స్‌‌ భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. భువీ, షమీతో పాటు ఆరో ఓవర్లో అక్షర్‌‌ బౌలింగ్‌‌లోనూ అలెక్స్‌‌ సిక్సర్లు కొట్టడంతో పవర్‌‌ ప్లేలోనే ఇంగ్లండ్‌‌ 63 రన్స్‌‌ రాబట్టింది. తర్వాత అశ్విన్‌‌, హార్దిక్‌‌ పాండ్యాను బరిలోకి దింపినా ఫలితం లేకపోయింది. తక్కువ దూరం ఉన్న స్క్వేర్‌‌ బౌండ్రీతో పాటు 80 మీటర్ల అవతల ఉన్న లాంగాన్‌‌, లాంగాఫ్‌‌ మీదుగా అలవోకగా బంతిని స్టాండ్స్‌‌కు పంపారు. 28 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ దాటిన హేల్స్‌‌.. పాండ్యా వేసిన 11వ ఓవర్లో మరో సిక్సర్‌‌తో  స్కోరు వంద దాటింది. మధ్యలో కాసేపు స్లో అయిన బట్లర్‌‌.. పాండ్యా తర్వాతి ఓవర్లోనే 4, 6తో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకున్నాడు. అదే జోరుతో షమీ బౌలింగ్‌‌లో సిక్స్‌‌తో మరో నాలుగు ఓవర్లు ఉండగానే మ్యాచ్‌‌ ముగించాడు.

‘ఇయ్యాల వరల్డ్​ కప్​ సెమీస్​ జరగలేదు. మనం ఏ మ్యాచూ చూడలేదు’. టీ20 వరల్డ్​కప్​లో ఇండియా–ఇంగ్లండ్​ సెమీస్​​ తర్వాత సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టిన మీమ్​​ ఇది. ఫ్యాన్స్​ నిజంగానే మర్చిపోవాల్సిన మ్యాచ్​ ఇది. అంత చెత్తగా ఆడి.. చిత్తుగా ఓడింది మన టీమ్​. పరిస్థితులకు అలవాటయ్యేందుకు అందరికంటే ముందే ఆస్ట్రేలియా వచ్చి.. సూపర్​12లో టాప్​ క్లాస్​ ఆటతో అదరగొట్టి.. కప్​పై ఆశలు రేపిన రోహిత్​సేన నాకౌట్​కు​ వచ్చేసరికి మళ్లీ పాత కథనే రిపీట్​ చేసింది. కొన్నేళ్లుగా ఐసీసీ ఈవెంట్ల చివరి దశలో తడబడుతున్న టీమిండియా ఈసారి కూడా సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఇంగ్లండ్​ చేతిలో పది వికెట్ల తేడాతో చిత్తయింది..! ఓటమికంటే కనీస పోటీ కూడా ఇవ్వకపోవడమే ఎక్కువ బాధ పెడుతోంది. 

బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌లో ఫెయిలయ్యాం

ఈ రోజు మా ఆట పట్ల చాలా నిరాశగా ఉన్నా. చివర్లో బాగా బ్యాటింగ్‌‌‌‌ చేసి ఆ స్కోరు సాధించాం. కానీ, దాన్ని కాపాడుకోవడంలో మా బౌలర్లు ఫెయిలయ్యారు. పూర్తి బ్యాటింగ్‌‌‌‌ పిచ్‌‌‌‌ కాకపోయినా బౌలింగ్‌‌‌‌లో తేలిపోయాం.  ఇలాంటి నాకౌట్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో ప్రెజర్‌‌‌‌ను ఎలా హ్యాండిల్‌‌‌‌ చేస్తారనే దానిపై అంతా ఆధారపడి ఉంటుంది.  కానీ, మా వాళ్లు  ఒత్తిడికి తలొగ్గారు.   ఏదేమైనా ఇంగ్లండ్‌‌‌‌ బాగా ఆడింది. వాళ్ల ఓపెనర్లకు క్రెడిట్‌‌‌‌ ఇవ్వాలి.  

‑ రోహిత్‌‌‌‌ శర్మ