
దుబాయ్:ఆసియా కప్‌లో దాయాది పాకిస్తాన్‌పై రెండో విజయాన్ని టీమిండియా కొద్దిలో చేజార్చుకుంది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (44 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 60) మునుపటి ఫామ్‌ను చూపెట్టినా.. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. దీంతో ఆదివారం జరిగిన సూపర్4 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించిన పాక్ గత ఓటమికి బదులు తీర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 181/7 స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ (16 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28), కేఎల్ రాహుల్ (20 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 28) రాణించారు. తర్వాత పాక్ 19.5 ఓవర్లలో 182/5 స్కోరు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (51 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71), మహ్మద్ నవాజ్ (20 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 42) చెలరేగారు. నవాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఇండియా.. శ్రీలంకతో తలపడుతుంది.
ఓపెనర్లు హిట్..
గత రెండు మ్యాచ్‌ల్లో ఫెయిలైన ఓపెనర్లు రోహిత్, రాహుల్ ఈసారి స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడిఅదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్‌లోనే రోహిత్ 4, 6తో టచ్‌లోకి వస్తే, మూడో ఓవర్‌లో రాహుల్ 6, 6తో జోరు పెంచాడు. ఐదో ఓవర్‌లో హిట్‌మ్యాన్ వరుసగా 4, 6 దంచాడు. కేవలం 26 బాల్స్‌లో తొలి ఫిఫ్టీ నమోదు చేసిన ఈ ఇద్దరు వరుస ఓవర్లలో ఔట్‌కావడంతో ఇన్నింగ్స్ తడబడింది. రవూఫ్ (1/38) వేసిన ఆరో ఓవర్ తొలి బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించి హిట్‌మ్యాన్ క్యాచ్ ఔటైతే, తర్వాతి ఓవర్‌లో రాహుల్ వికెట్ ఇచ్చుకుకోవడం తొలి వికెట్‌కు 54 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది.
కింగ్ ఈజ్ బ్యాక్
పవర్‌ప్లేలో 62/1తో నిలిచిన ఇండియాను కోహ్లీ ముందుకు తీసుకెళ్లాడు. చాలా రోజుల తర్వాత మునుపటి ఫామ్‌ను చూపెట్టాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో చివరి ఓవర్ వరకు క్రీజులో నిలిచాడు. రెండో ఎండ్‌లో సూర్య కుమార్ (13) రెండు బౌండ్రీలతో టచ్‌లోకి వచ్చినా.. 10వ ఓవర్‌లో అతను కొట్టిన స్వీప్ షాట్ స్క్వేర్ లెగ్‌లో ఆసిఫ్ అలీ చేతుల్లోకి వెళ్లింది. ఫలితంగా మూడో వికెట్‌కు 29 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఫస్ట్ టెన్‌లో ఇండియా 93/3 స్కోరు చేసింది. రిషబ్ పంత్ (14) అటాకింగ్ చేయకపోయాడు. సింగిల్స్‌కే మొగ్గు చూపిన తను 14వ ఓవర్‌లో ఔటయ్యాడు. ఐదు బంతుల తర్వాత హార్దిక్ పాండ్యా (0) డకౌట్ కావడం ఇండియా స్కోరుపై ప్రభావం చూపెట్టింది. 15 ఓవర్లలో 140/5 మాత్రమే చేసింది. దీపక్ హుడా (16) రెండు ఫోర్లు కొట్టినా ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేదు. 18వ ఓవర్‌లో సూపర్ సిక్స్‌తో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆరో వికెట్‌కు 37 రన్స్ జత చేసిన తర్వాత హుడా వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్‌ను రవూఫ్ కట్టుదిట్టంగా వేయడంతో విరాట్ తొలి మూడు బాల్స్‌కు ఒక్క రన్ తీయలేదు. ఒత్తిడిలో నాలుగో బాల్‌కు రనౌటయ్యాడు. రవి బిష్ణోయ్ (8 నాటౌట్) చివరి రెండు బాల్స్‌కు ఫోర్లు కొట్టడంతో ఇండియా మంచి టార్గెట్‌నే నిర్దేశించింది. షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీశాడు.
కీలక భాగస్వామ్యం..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో పాకిస్తాన్ ఎక్కడా ఇబ్బందిపడలేదు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (14) నాలుగో ఓవర్‌లోనే ఔటైనా.. మహ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. ఓ ఎండ్‌లో స్థిరంగా ఆడుతూ.. ఇండియా బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నాడు. దీంతో పాక్ 44/1 స్కోరు చేసింది. 9వ ఓవర్‌లో ఫఖర్ జమాన్ (15) ఔట్‌కావడంతో రెండో వికెట్‌కు 41 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. నవాజ్ సిక్సర్‌తో టచ్‌లోకి రావడంతో పాక్ 10 ఓవర్లలో 76/2 చేసింది. ఇప్పటివరకు మ్యాచ్ ఇండియా చేతుల్లోనే ఉన్నా.. పాండ్యా బౌలింగ్‌లో విఫలంకావడం దెబ్బకొట్టింది. మధ్యలో స్పిన్నర్లు చహల్, బిష్ణోయ్‌ను టార్గెట్ చేసుకుని రిజ్వాన్, నవాజ్ సిక్సర్లు ఫోర్లతో రెచ్చిపోవడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. వీళ్ల ధాటికి 5 ఓవర్లలోనే 59 రన్స్ వచ్చాయి. ఈ దశలో భువీ (16వ ఓవర్).. నవాజ్‌ను ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు 73 రన్స్ భాగస్వామానికి బ్రేక్ పడింది. ఇక 4 ఓవర్లలో 43 రన్స్ కావాల్సిన దశలో రిజ్వాన్ ఔటయ్యాడు. 18వ ఓవర్‌లో ఆసిఫ్ అలీ (16) ఇచ్చిన క్యాచ్‌ను అర్ష్‌దీప్ డ్రాప్ చేశాడు. 12 బాల్స్‌లో 26 రన్స్ అవసరం కాగా.. అలీ, కుల్దీప్ షా (14 నాటౌట్), ఇఫ్తికర్ (2 నాటౌట్) 6, 4, 4, 4తో ఓ బాల్ మిగిలి ఉండగానే లాంఛనం పూర్తి చేశారు.
ఆ క్యాచ్ పట్టుంటే
ఈ మ్యాచ్‌లో ఇండియా చేతుల్లోకి వచ్చిన విజయం చేజారడానికి ప్రధాన కారణం అర్ష్‌దీప్ సింగ్ పేలవ ఫీల్డింగే. అతను డ్రాప్ చేసిన క్యాచ్ వల్ల ఇండియా విక్టరీ చేజార్చుకుంది. పాక్‌కు 30 బాల్స్‌లో 47 రన్స్ అవసరమైన దశలో భువనేశ్వర్, హార్దిక్ రెండు వికెట్లు పడగొట్టి మన టీమ్‌ను రేసులోకి తెచ్చారు. 18వ ఓవర్లో బిష్ణోయ్ మూడు వైడ్లు సహా ఎనిమిది రన్స్ ఇచ్చాడు. మూడో బాల్‌కు ఆసిఫ్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అర్ష్‌దీప్ వదిలేశాడు. అప్పటికి ఆసిఫ్ ఖాతానే తెరవలేదు. ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్న హార్డ్ హిట్టర్ మరో ఆరు బాల్స్‌లోనే 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 16 రన్స్ రాబట్టి ఇండియా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. అర్ష్‌దీప్ ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది. చివరి ఓవర్లో కాకుండా భువీతో 19వ ఓవర్ వేయించడం కూడా చేటు చేసింది. సాధారణంగా స్లాగ్ ఓవర్లలో యార్కర్లు వేసే భువీ వైడ్ డెలివరీలు వేసి మూల్యం చెల్లించుకున్నాడు.