
ఆరు నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న భారత ఆటగాళ్లకు నెల రోజుల పాటు రెస్ట్ లభించనుంది. ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకున్న భారత క్రికెట్ జట్టు ఆగస్టు నెలలో ఖాళీగా ఉండబోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆ తర్వాత సుదీర్ఘ ఐపీఎల్, ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడి అలసిపోయిన మన ఆటగాళ్లకు ఎట్టకేలకు భారీ గ్యాప్ లభించింది. సెప్టెంబర్ లో జరగనున్న ఆసియా కప్ లో టీమిండియా మళ్ళీ క్రికెట్ బాట పడనుంది. టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది.
మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ బరిలో నిలిచాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లు జరుగుతాయి. 2023లో జరిగిన గత ఎడిషన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇండియా మ్యాచ్ ల విషయానికి వస్తే సెప్టెంబర్ 10న యుఎఇతో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రెండు మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్‌తో గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది.
టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే 2025 లో వెస్టిండీస్ తో అక్టోబర్ లో భారత జట్టు రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను సమం చేసిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ లో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఐదు మ్యాచ్‌లలో రెండు విజయాలతో 28 పాయింట్లతో 46.66 శాతాన్ని సాధించింది. స్వదేశంలో ఈ సిరీస్ టీమిండియా గెలవడం దాదాపు ఖాయం. అదే జరిగితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రెండో స్థానానికి ఎగబాగుతుంది. ఆ తర్వాత సౌతాఫ్రికాతో నవంబర్ లో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కూడా సొంతగడ్డపై టీమిండియా ఆడనుంది.
ALSO READ : డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటీ..వ్యూహం మార్చి చరిత్ర సృష్టించి
వన్డేల విషయానికి వస్తే భారత జట్టు అక్టోబర్ లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్ లో మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నారు. ఆగస్టు నెలలో శ్రీలంకతో వన్డేల సిరీస్ ప్లాన్ చేసినా అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.