
పెర్త్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. పెర్త్‌లో అడుగుపెట్టిన వెంటనే గురువారం స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తొలి నెట్ సెషన్‌లో పాల్గొన్నారు. గ్రౌండ్‌లో రన్నింగ్‌తో పాటు బ్యాటింగ్‌కు మెరుగులు పెట్టుకున్నారు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రో–కో జోడీ తొలిసారి టీమిండియా తరఫున బరిలోకి దిగుతుండటంతో అందరి దృష్టి వాళ్లపైనే నెలకొంది.
టెస్ట్, టీ20లకు గుడ్‌బై చెప్పిన ఈ ఇద్దరు ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. నెట్స్‌లో చెరో 30 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశారు. ప్రాక్టీస్ తర్వాత రోహిత్.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో చాలాసేపు ముచ్చటించాడు. కోహ్లీ.. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో మాట్లాడాడు. ఆ తర్వాత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌తోనూ కొన్ని నిమిషాలు గడిపాడు.
ఆ వెంటనే ఇద్దరూ ఫీల్డింగ్ ప్రాక్టీస్ వైపు కదిలారు. 2027 వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా వీళ్లు జట్టులో ఉండటం చాలా అవసరమని కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌లో రో–కో మంచి ఫామ్‌ను చూపెట్టాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది. శుక్ర, శనివారాల్లో జరిగే నెట్ సెషన్‌లోనూ వీళ్లు పాల్గొననున్నారు.
మరోవైపు కోహ్లీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మనం ఎప్పుడైతే చేతులెత్తేస్తామో అప్పుడు మాత్రమే మనకు ఓటమి వస్తుంది. ఎప్పుడైతే ఓ పనిని మధ్యలోనే వదిలేయాని నిర్ణయించుకుంటారో అప్పుడు మీరు విఫలమైనట్లే’ అని అర్థం వచ్చేలా ఎక్స్‌లో రాసుకొచ్చాడు.