‌‌‌ రెండో వన్డేకు సిద్ధమైన భారత్ ఇంగ్లాండ్

‌‌‌ రెండో వన్డేకు సిద్ధమైన భారత్ ఇంగ్లాండ్
  • నేడు ఇంగ్లండ్‌‌‌‌తో ఇండియా రెండో వన్డే
  • విరాట్‌‌ కోహ్లీ డౌట్‌‌
  • 5.30 నుంచి సోనీ నెట్‌‌వర్క్‌‌లో

లండన్‌‌‌‌‌‌‌‌‌‌: ఒకరిదేమో సిరీస్‌‌‌‌ టార్గెట్‌‌‌‌.. మరొకరిదేమో గెలిచి లెక్క సరి చేయాలన్న పట్టుదల.. ఈ నేపథ్యంలో ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌ రెండో వన్డేకు సిద్ధమయ్యాయి. గురువారం లార్డ్స్‌‌‌‌లో జరిగే మ్యాచ్‌‌‌‌లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బౌలర్ల తడాఖా, బ్యాటర్ల సమయోచిత పెర్ఫామెన్స్‌‌‌‌తో తొలి వన్డే గ్రాండ్‌‌‌‌ విక్టరీ కొట్టిన ఇండియా.. మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 1–0 లీడ్‌‌‌‌లో ఉంది. దీంతో రెండో మ్యాచ్‌‌‌‌లోనూ గెలిచి ఇక్కడే సిరీస్‌‌‌‌ను పట్టేయాలని భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్‌‌‌‌సేనకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. మాజీ కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ ఆడటంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. గజ్జ గాయంతో బాధపడుతున్న అతని కండీషన్‌‌‌‌పై ఎలాంటి సమాచారం లేదు. అయితే మాజీ కెప్టెన్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో లేకపోవడంతో అతని ఎంపికను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆలోచనగా తెలుస్తున్నది. కోహ్లీ ప్లేస్‌‌‌‌లో వచ్చిన యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ అద్భుతంగా ఆడుతుండటం ఇండియాకు కలిసొచ్చే అంశం. లార్డ్స్‌‌‌‌లోనూ ఓవల్‌‌‌‌ పిచ్‌‌‌‌లాంటిది ఎదురైతే మరోసారి తమ పవరెంటో చూపాలని రోహిత్‌‌‌‌ బృందం భావిస్తోంది. ఇందుకోసం తొలి వన్డేలో ఆడిన టీమ్‌‌‌‌ను యధావిధిగా దించనున్నారు. ఓపెనింగ్‌‌‌‌లో రోహిత్‌‌‌‌, ధవన్‌‌‌‌కు తిరుగులేకపోయినా, వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ పెంచాలి. శ్రేయస్‌‌‌‌ షార్ట్‌‌‌‌ బాల్స్‌‌‌‌ బలహీనతను అధిగమించాల్సి ఉంది. లేకపోతే దీపక్‌‌‌‌ హుడా నుంచి ప్రమాదం ఎదురుకావొచ్చు. ఇక సూర్యకుమార్‌‌‌‌ టీ20 ఫామ్‌‌‌‌ను కొనసాగించాలని కోరుకుంటున్నాడు. రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌, హార్దిక్‌‌‌‌ పాండ్యా ఫినిషర్లుగా తమ పాత్రకు న్యాయం చేస్తే చాలు. ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా జడేజా కీలకం కానున్నాడు. బౌలింగ్‌‌‌‌లో బుమ్రా, షమీ సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. థర్డ్‌‌‌‌  పేసర్‌‌‌‌గా ప్రసిధ్‌‌‌‌ను కొనసాగించొచ్చు. పాండ్యా బౌలింగ్‌‌‌‌ చేస్తుండటం అతిపెద్ద బలంగా మారింది. ఏకైక స్పిన్నర్‌‌‌‌గా చహల్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు ఢోకా లేదు. 

గెలిచి నిలుస్తారా?
మరోవైపు టీ20 సిరీస్‌‌‌‌ను చేజార్చుకున్న ఇంగ్లండ్‌‌‌‌.. వన్డే సిరీస్‌‌‌‌ను కోల్పోవద్దని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పేపర్‌‌‌‌ మీద బలంగా కనిపిస్తున్న ఆతిథ్య టీమ్‌‌‌‌ బ్యాటర్లు.. గ్రౌండ్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ పేసర్లను ఎదుర్కోవడంలో దారుణంగా విఫలమవుతున్నారు. దీంతో ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ను మార్చకుండా.. కొత్త వ్యూహాలతో బరిలోకి దిగాలని ఇంగ్లిష్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ భావిస్తోంది. ఓపెనింగ్‌‌‌‌లో రాయ్‌‌‌‌, బెయిర్‌‌‌‌స్టో శుభారంభం  ఇవ్వడంలో విఫలమవుతున్నారు. మిడిలార్డర్‌‌‌‌లో రూట్‌‌‌‌, బెన్‌‌‌‌స్టోక్స్‌‌‌‌ ఫామ్‌‌‌‌లేమి టీమ్‌‌‌‌ను వెంటాడుతున్నది. భారీ ఆశలు పెట్టుకున్న కొత్త కెప్టెన్‌‌‌‌ బట్లర్‌‌‌‌, లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ బ్యాట్లకు పని చెప్పడం లేదు. తొలి వన్డేలో పెద్దగా స్కోరు లేకపోవడంతో బౌలర్ల ప్రభావం కనిపించలేదు. అయితే ఈ మ్యాచ్‌‌‌‌ కీలకం కావడంతో బౌలర్లందరూ సమయోచితంగా రాణిస్తేనే ఇంగ్లండ్‌‌‌‌ విజయాన్ని ఆశించొచ్చు. పేసర్లు విల్లే, టోప్లే, కార్సే, ఓవర్టన్‌‌‌‌ మరింత గాడిలో పడాలి. తొలి మ్యాచ్‌‌‌‌లో వీళ్లు ఒక్క వికెట్‌‌‌‌ కూడా తీయకపోవడం కాస్త నిరాశపరిచే అంశం. స్పిన్నర్‌‌‌‌గా మొయిన్‌‌‌‌ అలీ ప్రభావం చూపెట్టాలి. పిచ్​ బ్యాటింగ్​కు అనుకూలం. 

జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), ధవన్‌‌‌‌, శ్రేయస్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌, పంత్‌‌‌‌, హార్దిక్‌‌‌‌, జడేజా, షమీ, బుమ్రా, ప్రసిధ్‌‌‌‌, చహల్‌‌‌‌. 
ఇంగ్లండ్‌‌‌‌: బట్లర్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), రాయ్‌‌‌‌, బెయిర్‌‌‌‌స్టో, రూట్‌‌‌‌, స్టోక్స్‌‌‌‌, లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌, అలీ, విల్లే, ఓవర్టన్‌‌‌‌ / సామ్‌‌‌‌ కరన్‌‌‌‌, కార్సే, టోప్లే.