ఇంగ్లాండ్పై రోహిత్ సేన ఘన విజయం

 ఇంగ్లాండ్పై రోహిత్ సేన ఘన విజయం

ఓవల్ వన్డేలో రోహిత్ శర్మ సేన రెచ్చిపోయింది. టీ20 సిరీస్ జోరును కొనసాగిస్తూ..ఫస్ట్ వన్డేలో ఇంగ్లాండ్పై అద్భుత విజయం సాధించింది. అతిధ్య జట్టుపై అన్ని విభాగాల్లో పైచేయి సాధిస్తూ..10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 111 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా..కేవలం 18.4  ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ  సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.  58  బంతుల్లో  5 సిక్సర్లు, 7  ఫోర్లతో 76  పరుగులు సాధించగా..ధావన్ 54  బంతుల్లో 31  పరుగులతో రాణించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 

బుమ్రా సిక్స్ వికెట్స్..
అంతకుముందు  టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆతిధ్య జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 25.2 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌట్ అయింది. బుమ్రా ధాటికి ఆ జట్టు 7 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జేసన్ రాయ్, రూట్, స్టోక్స్ ముగ్గురు డకౌట్ అయ్యారు. 17 పరుగుల వద్ద బెయిర్ స్టో పెవీలియన్ చేరాడు. ఆ వెంటనే 26 పరుగుల వద్ద ఆల్రౌండర్ లివింగ్ స్టన్ను  బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో మొయిన్ అలీ,బట్లర్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే 56 పరుగుల వద్ద ప్రసిద్ధ కృష్ణ మొయిన్ అలీని ఔట్ చేశాడు. ఆ తర్వాత  బట్లర్ను షమీ పెవీలియన్ చేర్చాడు. అక్కడి నుంచి ఇంగ్లాండ్ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో డేవిడ్ విల్లే కాసేపు పోరాడిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లు దక్కించుకోగా..షమీ మూడు వికెట్లు తీసుకున్నాడు. ప్రసిద్ధ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు. 

బుమ్రా రికార్డు..
ఈ మ్యాచులో ఆరు వికెట్లు దక్కించుకున్న బుమ్రా..వన్డేల్లో టీమిండియా తరపున అరుదైన రికార్డు సాధించాడు.  వన్డేలో మొదటి 10 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు.  జేసన్‌ రాయ్‌, బేయిర్​ స్టో, జో రూట్‌, లివింగ్‌స్టోన్‌ ల వికెట్లు బుమ్రా తీసుకున్నాడు. గతంలో 2003లో జోహన్నెస్‌బర్గ్‌ లో  శ్రీలంకపై జగవల్‌ శ్రీనాథ్‌ తొలి పది ఓవర్లలో నాలుగు వికెట్లు,  2013లో శ్రీలంకపై భువనేశ్వర్‌ కుమార్‌ 4 వికెట్లు దక్కించుకున్నారు. మరోవైపు ఈ  మ్యాచ్ లో  7.2 ఓవర్లు వేసి 19 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీసుకున్న బుమ్రా..వన్డేల్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశారు.  ఈ క్రమంలో  స్టువర్ట్ బిన్నీ(6/4),కుంబ్లే (6/12) తర్వాత  వన్డేల్లో టీమిండియా తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన థార్డ్ బౌలర్గా బుమ్రా నిలిచాడు. అటు ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్పై  అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గానూ నిలిచాడు. గతంలో  ఆశిష్  నెహ్రా.. (6/23) డర్బన్ లో ఇంగ్లాండ్పై బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. కుల్దీప్ యాదవ్..6/25 తో తర్వాత స్థానంలో ఉన్నాడు. 

ధావన్ -రోహిత్ జోడీ రికార్డు
వన్డేల్లో ధావన్- రోహిత్ జోడి రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ వన్డేలో 6 పరుగులు చేయడం ద్వారా వన్డేల్లో 5 వేల క్లబ్ లో ఈ జోడి చేరింది. ఇప్పటి వరకు ఈ జంట 112 మ్యాచుల్లో 5108 రన్స్ చేసింది. దీంతో భారత్ తరపున 5వేల రన్స్ చేసిన రెండో జోడిగా ధావన్, రోహిత్ చరిత్రకెక్కింది. ఈ జాబితాతో ఓవరాల్ గా  సచిన్, గంగూలీ అగ్రస్థానంలో ఉంది. వీరిద్దరూ  136 వన్డేల్లో 6609 పరుగులు చేశారు.