నేడు ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి టీ 20

నేడు ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి టీ 20
  • కప్పుపై కన్నేసి.. కంగారూలతో సై
  • ఆరో బౌలర్‌‌‌‌, మిడిలార్డర్ ను సెట్​ చేసుకోవడంపై ఫోకస్​
  • రా. 7.30 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో

మొహాలీ: ఆసియా కప్‌‌‌‌లో నిరాశ పరిచిన టీమిండియా ఇప్పుడు టీ20 వరల్డ్‌‌కప్‌‌పై కన్నేసింది. వచ్చే నెలలో జరిగే మెగా టోర్నీకి ఫైనల్​రౌండ్​ ప్రిపరేషన్స్​కు రెడీ అయింది. టీమ్‌‌ కాంబినేషన్స్‌‌ను సెట్‌‌ చేసుకోవడంతో పాటు తమ ప్లాన్స్​కు తుది రూపు ఇవ్వడమే టార్గెట్‌‌గా ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌‌లో  మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌‌లో బరిలోకి దిగుతోంది. పేరుకు ఆసీస్‌‌తో పోటీ అయినప్పటికీ టీమ్‌‌ ఫోకస్‌‌ మొత్తం వరల్డ్‌‌కప్‌‌పైనే ఉంది. ఆ మెగా టోర్నీకి ముందు ఆసీస్‌‌, సౌతాఫ్రికాతో జరిగే ఆరు టీ20ల్లో  కొందరు ఫాస్ట్‌‌ బౌలర్లకు రెస్ట్‌‌ ఇస్తూనే.. పూర్తి జట్టును పరీక్షించి కాంబినేషన్‌‌పై ఓ అంచనాకు రావాలని చూస్తోంది. ఆసియాకప్‌‌లో బయటపెట్టిన బలహీనతలను సరిదిద్దుకునేందుకు ఇండియాకు ఇది మంచి అవకాశం. యూఏఈలో ఇండియా బాగానే బ్యాటింగ్‌‌ చేసినప్పటికీ తుది జట్టులో అతి మార్పులు దెబ్బకొట్టాయి. బౌలింగ్‌‌ కూడా బలహీనంగా కనిపించింది. కానీ, బుమ్రా, హర్షల్‌‌ తిరిగి రావడంతో బౌలింగ్‌‌ విభాగం బలోపేతం అయింది. టీ20 వరల్డ్‌‌ కప్‌‌ లో కేఎల్‌‌ రాహుల్‌‌  ఇన్నింగ్స్‌‌ ఓపెన్‌‌ చేస్తాడని రోహిత్‌‌ స్పష్టం చేశాడు. కేఎల్‌‌ మ్యాచ్‌‌ విన్నర్‌‌, విలువైన ఆటగాడని కితాబిచ్చాడు. అయితే, గాయం నుంచి కోలుకున్న తర్వాత జింబాబ్వే టూర్‌‌, ఆసియా కప్‌‌లో ఫెయిలైన రాహుల్‌‌.. ఈ సిరీస్‌‌తో తిరిగి ఫామ్‌‌ అందుకొని కెప్టెన్‌‌ నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. తన ప్లేస్‌‌కు ఎలాంటి ముప్పు ఉండకూడదంటే కేఎల్‌‌ తక్షణమే పరుగులు చేయాల్సి ఉంటుంది. 

ఆసియా కప్‌‌లో ఒక్క ఇన్నింగ్స్‌‌లో తప్పితే పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కెప్టెన్‌‌ రోహిత్‌‌ సైతం.. ఆసీస్‌‌పై ధనాధన్‌‌ ఇన్నింగ్స్‌‌లు ఆడితే వరల్డ్‌‌కప్‌‌నకు ముందు అతని కాన్ఫిడెన్స్‌‌ కూడా పెరుగుతుంది. గత ఐదు ఇన్నింగ్స్‌‌ల్లో రెండు ఫిఫ్టీలు, ఓ సెంచరీ కొట్టిన కోహ్లీ మునుపటి రిథమ్‌‌ అందుకున్నాడు. తను అదే జోరును కొనసాగిస్తే తిరుగుండదు. రాహుల్‌‌, రోహిత్‌‌, కోహ్లీ, సూర్యకుమార్‌‌తో టాప్‌‌–4 సెటిల్డ్‌‌గా కనిపిస్తోంది. అయితే, తుదిజట్టులో వికెట్‌‌ కీపర్లు  పంత్‌‌,  కార్తీక్‌‌ పాత్ర ఏమిటనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. జడేజా గైర్హాజరీలో లెఫ్టాండర్‌‌  పంత్‌‌కు ఫినిషింగ్‌‌ బాధ్యత అప్పగించాలా?  లేక అనుభవజ్జుడైన కార్తీక్‌‌కు మొగ్గు చూపాలా? అనేది తేల్చుకోవాలి. యూఏఈలో దీపక్‌‌ హుడా అన్ని సూపర్‌‌4 మ్యాచ్‌‌ల్లో ఆడినప్పటికీ అతని రోల్‌‌పై క్లారిటీ లేదు. జడేజాకు గాయం అవడం ఆసియాకప్‌‌లో టీమ్‌‌ బౌలింగ్‌‌ బ్యాలెన్స్‌‌ను దెబ్బతీసింది. ఆరుగురు బౌలర్ల ఆప్షన్‌‌ నుంచి ఐదుగురు బౌలర్లకు రావాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో  పాండ్యాతో పాటు మరో ఆల్‌‌రౌండర్‌‌గా అక్షర్‌‌ను తీసుకుంటే బౌలింగ్‌‌లో ఆప్షన్స్‌‌ పెరుగుతాయి. లెఫ్టాండర్‌‌ కావడంతో బ్యాటింగ్‌‌ లైనప్‌‌లోనూ అక్షర్‌‌ వైవిధ్యం తీసుకొస్తాడు. అతనితో పాటు చహల్‌‌ స్పిన్‌‌ను నడిపిస్తే .. బౌలింగ్‌‌లో బుమ్రా, భువీ, హర్షల్‌‌కు హార్దిక్‌‌ తోడైతే ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగినట్టు అవుతుంది.

అయినా బలంగానే ఆసీస్‌‌‌‌ 

ఇండియా మాదిరిగా వరల్డ్​కప్​ ప్రిపరేషన్స్​లో ఉన్న ఆసీస్​ డేవిడ్‌‌ వార్నర్‌‌ సహా పలువురు కీలక ఆటగాళ్లు లేకుండానే ఇండియా వచ్చింది. వార్నర్‌‌కు రెస్ట్‌‌ ఇవ్వగా.. మిచెల్‌‌ స్టార్క్‌‌, మార్కస్‌‌ స్టోయినిస్‌‌, మిచెల్‌‌ మార్ష్‌‌ చిన్న గాయాల కారణంగా స్వదేశంలోనే ఉండిపోయారు. వీళ్లు లేకపోయినా ఆసీస్‌‌ బలంగానే కనిపిస్తోంది.  వన్డే ఫార్మాట్‌‌ నుంచి రిటైరైన కెప్టెన్‌‌ ఫించ్‌‌పైనే అందరి ఫోకస్‌‌ ఉంది. వచ్చే నెలలో సొంతగడ్డపై టీ20 వరల్డ్‌‌కప్‌‌ ముంగిట భారీ ఇన్నింగ్స్‌‌లు ఆడాలని ఫించ్‌‌ కోరుకుంటున్నాడు. ఇక, గతంలో సింగపూర్‌‌ నేషనల్‌‌ టీమ్‌‌కు ఆడిన పవర్ హిట్టర్‌‌ టిమ్‌‌ డేవిడ్‌‌ ఈ సిరీస్‌‌తో ఆసీస్ తరఫున తొలిసారి బరిలోకి దిగబోతున్నాడు. ఐపీఎల్‌‌తో పాటు వివిధ లీగ్స్‌‌లో పవర్‌‌ హిట్టింగ్‌‌తో పేరు తెచ్చుకున్న టిమ్‌‌ డేవిడ్‌‌ క్షణాల్లో మ్యాచ్‌‌ను మార్చేయగలడు. ఆసీస్​ వరల్డ్‌‌కప్‌‌ టీమ్‌‌లో కూడా  ఉన్న టిమ్‌‌పై భారీ అంచనాలున్నాయి. మరో డ్యాషింగ్‌‌ బ్యాటర్‌‌ గ్లెన్‌‌ మ్యాక్స్‌‌వెల్‌‌తో ఇండియా బౌలర్లకు ముప్పుంది. పేసర్లు కమిన్స్‌‌, హేజిల్‌‌వుడ్‌‌.. స్పిన్నర్లు అగర్‌‌, జంపాతో ఇండియా బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాలి. 

తుది జట్లు (అంచనా):
ఇండియా: కేఎల్‌‌ రాహుల్‌‌, రోహిత్‌‌ (కెప్టెన్‌‌), కోహ్లీ, పంత్‌‌/కార్తీక్‌‌ (కీపర్‌‌), సూర్యకుమార్‌‌, హార్దిక్‌‌, అక్షర్‌‌, భువనేశ్వర్‌‌, అశ్విన్‌‌/చహల్‌‌, హర్షల్‌‌, బుమ్రా. 
ఆస్ట్రేలియా: ఫించ్‌‌ (కెప్టెన్‌‌), వేడ్‌‌ (కీపర్‌‌), స్మిత్‌‌, మ్యాక్స్‌‌వెల్‌‌, టిమ్‌‌ డేవిడ్‌‌, గ్రీన్‌‌, అగర్‌‌, కమిన్స్‌‌, సామ్స్‌‌, జంపా, హేజిల్‌‌వుడ్‌‌.