
- 45 రోజులు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించిన ఎస్పీ జానకీ షర్మిల
- శనివారం మంత్రి సీతక్క చేతుల మీదుగా స్పెషల్ గ్రూప్ ప్రారంభం
- రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘శివంగి’ టీమ్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచన
నిర్మల్, వెలుగు : నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక కమాండో గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్‌కు ప్రత్యేకంగా ‘టీమ్ సివంగి’ అని పేరు పెట్టారు. ఎన్‌ఎస్‌జీ, ఎస్‌పీజీతో పాటు గ్రేహౌండ్స్‌కు దీటుగా ఈ టీమ్‌కు ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించారు. ‘టీమ్ సివంగి’ కమాండో గ్రూప్‌ను శనివారం స్థానిక కలెక్టరేట్‌లో పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రారంభించారు.
45 రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న చురుకైన 20 మంది మహిళా కానిస్టేబుళ్లను ‘టీమ్ సివంగి’ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. వీరికి మేల్ కమాండోలతో సమానంగా 45 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణలో భాగంగా వర్టికల్ రోప్ క్లైంబింగ్, మనుగడ పద్ధతులు, యుద్ధ తంత్రాలు, పోరాట నైపుణ్యాలతో పాటు పేలుడు పదార్థాలు, వెపన్ ట్రైనింగ్, ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలను ఉపయోగించడం, ఫైరింగ్, ఫీల్డ్ సిగ్నల్స్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ లేకుండా నావిగేట్ చేయడం, ఆకస్మిక వ్యూహాల రచన, శత్రువుల కదలికలు గమనించడం, అడవుల్లో కూంబింగ్, నిఘా పద్ధతులు, రహస్య స్థావరాలపై దాడులు చేయడం వంటి అంశాల్లో తీర్చిదిద్దారు. శిక్షణ సందర్భంగా ఆయా విభాగాల్లో నైపుణ్యం కనబరిచిన వారికి ఆ విభాగాల కమాండింగ్ బాధ్యతలను
అప్పగించారు.
కప్పనపల్లి అడవుల్లో కూంబింగ్ సక్సెస్
నిర్మల్ జిల్లాలోని మామడ మండలం కప్పనపల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళా కూలీలు ఇటీవల దట్టమైన అడవుల్లో తప్పిపోయారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్పీ జానకీ షర్మిల వెంటనే టీమ్ సివంగి కమాండో బృందాన్ని రంగంలోకి దింపారు. ఎస్పీ నేతృత్వంలో మహిళ కమాండోలు దట్టమైన అడవిలో రాత్రంతా కూంబింగ్ నిర్వహించి, ఎట్టకేలకు నలుగురు మహిళలను గుర్తించారు. పురుష కమాండోస్‌కు దీటుగా మహిళలు చీకట్లో, దట్టమైన అడవిలో కూంబింగ్ నిర్వహించిన తీరును పలువురు ప్రశంసించారు.
అన్ని జిల్లాల్లో అమలు చేయాలన్న మంత్రి
నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీమ్ సివంగి గ్రూప్‌ను మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇలాంటి టీమ్స్‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా కమాండోలతో ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేసిన ఎస్పీ జానకీ షర్మిలను అభినందించారు. అనంతరం మహిళా కమాండోల పరేడ్‌ను తిలకించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి టీమ్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తే పోలీస్ శాఖకు అదనపు బలం చేకూరుతుందని, మహిళల్లో భరోసా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.