
Google Layoffs: అమెరికాలోని అనేక టెక్ దిగ్గజ కంపెనీలు ప్రతి త్రైమాసికంలోనూ వందల సంఖ్యలో ఉద్యోగుల కోతలను ప్రకటిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ వరుసగా మూడోసారి లేఆఫ్స్ ప్రకటించటం టెక్కీలను ఆందోళనలకు గురిచేస్తోంది. తాజాగా గూగుల్ సంస్థ తన గ్లోబల్ బిజినెస్ యూనిట్ నుంచి 200 మంది వరకు ఉద్యోగులను ఇళ్లకు పంపినట్లు వెల్లడైంది. ఈ ఉద్యోగులు సేల్స్ అండ్ పార్ట్నర్ షిప్ విభాగానికి చెందిన వ్యక్తులుగా తేలింది. 2025 ప్రారంభం నుంచి కేవలం 5 నెలల కాలంలో కంపెనీ ఉద్యోగుల కోతలను ప్రకటించటం మూడోసారి కావటంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చాలా టెక్ కంపెనీలు ప్రస్తుతం తమ నిధులను ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటు వంటివాటికి వినియోగిస్తూ చాలా చోట్ల ఖర్చులను మదింపు చేయటమే అమెరికా టెక్ కంపెనీల్లో వరుస లేఆఫ్స్ ప్రకటనలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే గూగుల్ మాత్రం తొలగింపులపై స్పందిస్తూ.. తాము అంతర్గతంగా కొన్ని చిన్న మార్పులు చేస్తున్నామని, తద్వారా కస్టమర్లకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించాలని చూస్తున్నట్లు పేర్కొంది. తన సేవలను మెరుగుపరుచుకునే క్రమంలో తప్పక తీసుకున్న నిర్ణయంగా టెక్ దిగ్గజం పేర్కొంది.
లేఆఫ్స్ ప్రస్తుతం గూగుల్ కి మాత్రమే పరిమితం కాలేదు. కొన్ని నెలల కిందట అమెరికాకు చెందిన దిగ్గజాలైన ఆపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు సైతం తమ ఉద్యోగుల సంఖ్యల్లో భారీగానే కోతలను ప్రకటించాయి. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగులు ఉపాధి అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది.