మేడిగడ్డపై టెక్నికల్ కమిటీ

మేడిగడ్డపై టెక్నికల్ కమిటీ
  • ఇద్దరు ఈఎన్సీలు, ఇద్దరు సీఈలతో ఏర్పాటు
  • ఇరిగేషన్ అధికారులతో జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ భేటీ

హైదరాబాద్, వెలుగు: కుంగిన మేడిగడ్డ బ్యారేజీపై అధ్యయనానికి టెక్నికల్ కమిటీ ఏర్పాటు కానుంది. కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్​కమిషన్​చైర్మన్​జస్టిస్​ఘోష్​సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్​రావు, సీడీవో (సెంట్రల్​డిజైన్స్​ఆర్గనైజేషన్) సీఈ, రామగుండం సీఈ ఉంటారు. ప్రాజెక్టుకు చేసే రిపేర్లు, ఇతరత్రా టెక్నికల్​అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. గురువారం బీఆర్కే భవన్​లో ఇరిగేషన్​ఈఎన్సీ (జనరల్) అనిల్ కుమార్, ఈఎన్సీ (ఓఅండ్​ఎం) బి.నాగేందర్​రావుతో జస్టిస్ ఘోష్​సమావేశమయ్యారు. బ్యారేజీకి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఈఎన్సీలతో ఆయన చర్చించినట్టు తెలిసింది. బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్​ పరిస్థితి దారుణంగా ఉందని అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ సందర్భంగా బ్యారేజీ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యలనూ అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. కాగా, ఎంక్వైరీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న పట్టుదలతో జస్టిస్​ఘోష్​ఉన్నట్టు ఇంజినీర్లు చెబుతున్నారు. 

ఎన్డీఎస్ఏ నివేదికపై ఆరా.. 

మేడిగడ్డ బ్యారేజీపై ఇప్పటికే వచ్చిన రిపోర్టులతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన రిపోర్టు గురించి కూడా జస్టిస్​ఘోష్​ఆరా తీసినట్టు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికను ఇరిగేషన్ అధికారులకు ఇప్పటికే పంపించింది. రిపేర్లు చేసినా బ్యారేజీలో దెబ్బతిన్న బ్లాక్​ బాగవుతుందన్న గ్యారంటీ లేదంటూ కమిటీ రిపోర్టులో పేర్కొన్న అంశాన్ని ఘోష్ కు అధికారులు వివరించినట్టు తెలిసింది. ఈ ఫ్లడ్​సీజన్​కు ముందే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను ఎత్తి ఉంచాలన్న విషయాన్ని కూడా చెప్పినట్టు సమాచారం. బ్యారేజీల వద్ద మరోసారి చేయాల్సిన టెస్టుల గురించి జస్టిస్​ ఘోష్​కు చెప్పినట్టు తెలిసింది. మరోవైపు బీఆర్​కే భవన్​లో ఏర్పాటు చేసిన సజెషన్/విట్నెస్​బాక్సుల్లో పదుల సంఖ్యలో ప్రజల నుంచి అఫిడవిట్లు వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ రెండు బాక్సులూ నిండిపోయాయని చెబుతున్నారు. ఎన్నికలయ్యాక ఆ బాక్స్​లను ఓపెన్​చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.