ఫేస్ బుక్ లోనూ చాట్ జీపీటీ తరహా టెక్నాలజీ

ఫేస్ బుక్ లోనూ చాట్ జీపీటీ తరహా టెక్నాలజీ

నేటి డిజిటల్‌ ప్రపంచంలో గూగుల్‌ పేరు లేకుండా..సాయం తీసుకోకుండా కోట్లమందికి రోజు గడవటంలేదు. మనిషి జీవితంలో ఈ సెర్చ్‌ ఇంజిన్‌ అంతలా భాగమైంది. జీ మెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌, మ్యాప్స్‌, గూగుల్‌ మీట్‌ వంటి మాధ్యమాల ద్వారా పట్టణాల నుంచి మారుమూల పల్లెల వరకు ప్రజల జీవితాలపై చెరగని ముద్రవేస్తోంది. కనీసం కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఏ సందేహం వచ్చినా.. సమాచారం కావాలన్నా గూగులమ్మను అడగడం కామన్ అయ్యింది. మనిషి జీవితంలో ఇంతటి ప్రధాన పాత్ర పోషిస్తున్న గూగుల్‌కు ఇక కాలం చెల్లిపోయినట్టేనా..? అందుకు ప్రధాన కారణం సాంకేతిక ప్రపంచంలోకి వచ్చీ రావటంతోనే సంచలనాలు సృష్టిస్తున్న ‘చాట్‌ జీపీటీ’. ఇది ఓ కొత్తతరం సెర్చ్‌ ఇంజిన్‌. 

ప్రస్తుత ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజిన్లలో గూగుల్‌ నంబర్‌ వన్‌. కొంతకాలంగా ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ రంగం వేగంగా అభివృద్ధి సాధిస్తూ సాంకేతిక రంగాన్ని సమూలంగా మార్చివేస్తోంది. ఆ టెక్నాలజీ ఆధారంగా పుట్టుకొచ్చిందే చాట్‌ జీపీటీ. అందులో చాట్‌ అనగా మాట్లాడటం. జీపీటీ అంటే జనరేటివ్‌ ప్రీ ట్రైన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌. అంటే ఈ చాట్‌ బోట్‌కు ముందుగా శిక్షణ ఇస్తారు. ఎప్పటికప్పుడు విషయాలను దీనికి కలపటం ద్వారా మనకు సాధారణ మనిషి ఇచ్చిన విధంగానే సమాధానాలు ఇచ్చేలా చాట్‌ జీపీటీని తీర్చిదిద్దారు. ఏఐ టెక్నాలజీ మీద పరిశోధన చేస్తున్న శానిఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్‌ ఏఐ అనే కంపెనీ దీనిని ఆవిష్కరించింది. 

టెక్నాలజీ దిగ్గజం మేటా కూడా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) రేసును మొదలుపెట్టింది. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో చాటా జీపీటీ తరహా సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం మెటా ఉన్నత స్థాయి ప్రొడక్ట్ గ్రూప్ ను నియమించుకుంది. దానికి మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ నేతృత్వం వహిస్తున్నాడు.

ప్రజలకు అన్ని రకాల అవసరాలను తీర్చే విధంగా ఈ ఏఐని అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం టెక్స్ట్, వీడియో, ఇమేజెస్ లు ఏఐ మోడల్ లో అభివృద్ధి చేస్తున్నారు. చాట్ జీపీటీ లాంటి సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. స్నాప్ చాట్ కూడా ఏఐ బాట్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.